ఛీఛీ నువ్వేం కొడుకువురా.. జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
మత్తు పదార్థాలకు బానిసైన ఒక కొడుకు ఉన్మాదిలా మారి కన్నతల్లి నివసిస్తున్న ఇంటినే తగలబెట్టిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం, విలాసవంతమైన జీవితం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఇల్లంతా పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్ గ్రామంలో చోటుచేసుకుంది.

మత్తు పదార్థాలకు బానిసైన ఓ కన్నకొడుకు ఉన్మాదంగా ప్రవర్తించాడు. మద్యం, విలాసాల కోసం డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లి నివసిస్తున్న ఇల్లే తగలబెట్టిన దారుణ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్ గ్రామంలో వెలుగుచూసింది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్కల్ గ్రామానికి చెందిన రజిని అనే మహిళ సుమారు 20 ఏళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తన స్వగ్రామంలోనే ఉంటూ, ఓ రేషన్ షాపు నిర్వహిస్తూ ఒంటరిగా జీవితాన్ని సాగిస్తున్నారు.
అయితే, ఆమె కుమారుడు గౌతమ్ రెడ్డి, జులాయిగా తిరుగుతూ మద్యం, గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. గతంలో ఇతనిపై గంజాయి కేసు కూడా నమోదైంది..కొత్త కారు కొనుగోలు చేయడానికి, అలాగే జల్సాలకు డబ్బులు కావాలంటూ గౌతమ్ రెడ్డి తరచూ తల్లిని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్రంగా దూషిస్తూ,దాడి చేస్తూ, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మద్యం మత్తులో తల్లితో మరోసారి తీవ్రంగా గొడవకు దిగాడు. కొడుకు ప్రవర్తనతో భయాందోళనకు గురైన తల్లి రజిని, ప్రాణభయంతో ఇల్లు వదిలి రామాయంపేటలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయారు..తల్లి ఇంట్లో లేకపోవడంతో ఆగ్రహానికి గురైన గౌతమ్ రెడ్డి ఉన్మాదిలా ప్రవర్తించాడు. అదే రాత్రి తల్లి నివాసానికి చేరుకుని, ఇల్లంతా పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన వస్తువులు, రేషన్ సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాధితురాలు రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు పోలీసులు.




