ఫేస్ క్లీన్-అప్ vs ఫేషియల్.. మీ చర్మానికి ఏది ఉత్తమం? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!
మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కోసం పార్లర్‌కు వెళ్లినప్పుడు మనకు ఎదురయ్యే ప్రధాన సందేహం ..ఫేస్ క్లీనప్ చేయించుకోవాలా లేక ఫేషియల్ చేయించుకోవాలా? రెండూ చర్మాన్ని అందంగా మార్చడానికి ఉపయోగపడినప్పటికీ, వీటి పనితీరు, పట్టే సమయం, ఇచ్చే ఫలితాల్లో చాలా తేడాలు ఉన్నాయి. మీ చర్మ తత్వానికి ఏది సరైనదో ఇక్కడ తెలుసుకుందాం.

చర్మ సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లినప్పుడు చాలామందికి ఫేస్ క్లీనప్, ఫేషియల్ మధ్య ఉన్న తేడా తెలియక అయోమయానికి గురవుతారు. ఫేస్ క్లీనప్ అనేది చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, మృతకణాలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించే ప్రాథమిక ప్రక్రియ. అయితే, ఈ రెండింటి మధ్య తేడాలు, ప్రయోజనాలేంటో వివరంగా చూద్దాం..
ఫేస్ క్లీన్-అప్ అంటే ఏమిటి?
ఫేస్ క్లీనప్ అనేది చర్మం పైపొరపై ఉండే దుమ్ము, జిడ్డు, మృతకణాలు, బ్లాక్‌హెడ్స్ తొలగించే ఒక ప్రాథమిక ప్రక్రియ. క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, ఆవిరి పట్టడం, బ్లాక్‌హెడ్స్/వైట్‌హెడ్స్ తొలగించడం, తేలికపాటి ఫేస్ ప్యాక్ వేయడంతో ఇది పూర్తవుతుంది. దీనికి సుమారు 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుంది. ఖర్చు కూడా తక్కువే. ఇందులో మసాజ్ ఉండదు. ప్రతిరోజూ కాలుష్యం, ఎండలో తిరిగేవారికి, టీనేజర్లు, తక్కువ సమయంలో తక్షణ తాజాదనం కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. దీనిని నెలకు 1-2 సార్లు చేయించుకోవచ్చు.
ఫేషియల్ అంటే ఏమిటి?
ఫేషియల్ అనేది చర్మానికి లోతైన పోషణ, తేమ, విశ్రాంతిని ఇచ్చే సమగ్రమైన స్కిన్ కేర్ ట్రీట్‌మెంట్. క్లీనప్‌లోని అన్ని దశలతో పాటు, ఇందులో చర్మ రకానికి తగిన ప్రత్యేక సీరమ్‌లు, క్రీమ్‌లతో 15-20 నిమిషాల పాటు ఫేషియల్ మసాజ్ చేస్తారు. ఇది రక్త ప్రసరణను పెంచి, చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. దీనికి 60 నుండి 90 నిమిషాల సమయం పడుతుంది. క్లీనప్ కంటే ఖర్చు కాస్త ఎక్కువ. ముడతలు, పిగ్మెంటేషన్, పొడిబారడం, టానింగ్ వంటి సమస్యలతో బాధపడేవారికి, వయసు 20 దాటిన వారికి ఫేషియల్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని నెలకోసారి చేయించుకుంటే సరిపోతుంది.
మీ చర్మానికి ఏది ఉత్తమం?
మీరు ఏదైనా చిన్న కార్యక్రమానికి త్వరగా సిద్ధమవ్వాలి అనుకున్నా లేదా కేవలం చర్మాన్ని శుభ్రపరుచుకోవాలనుకున్నా ఫేస్ క్లీనప్ ఎంచుకోండి. అలాకాకుండా చర్మ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం, లోతైన గ్లో , రిలాక్సేషన్ కావాలనుకుంటే ఫేషియల్ ఎంచుకోవడం ఉత్తమం.




