భయంకర తుఫాన్‌గా దూసుకొస్తున్న అక్వాన్.. తీరం దాటేది అక్కడే.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
అక్వాన్ తుఫాన్ దూసుకొస్తుంది. ఇప్పటికే ఇది తుఫాన్‌గా బలపడగా.. నవంబర్ 18న ఉదయం తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత గురువారం నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది.

దక్షిణ, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అక్వాన్ తుపాన్ గడిచిన మూడు గంటల్లో స్థిరంగా కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడనుందని వెల్లడించారు. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం సాయంత్రానికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖపట్నానికి 650 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు- విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిమీ, గరిష్ఠంగా 145 వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
తుపాను ప్రబావంతో కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 100-110 కిమీ వేగంతో ఈదురుగాలులు, ఎల్లుండి నుంచి తీరం దాటే వరకు గంటకు 120-130 కి.మీ, గరిష్ఠంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆర్టీజిఎస్ – విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాన్ పయనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ జిల్లా యంత్రాంగానికి తగిన సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF, 11 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. కోస్తా తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తుపాను వలన ఏ సమస్య ఎదురైనా 9552300009 మన మిత్ర ద్వారా వెంటనే అధికారులకు తెలియజేయవచ్చన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలన్నారు.
తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావం నుంచి ప్రాణ, ఆస్తినష్టాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తుపానుకు ముందు ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని, భయపడవద్దని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసి ఉంచుకుంటూ విపత్తుల సంస్థ, ఆర్టీజిఎస్, ఐఎండి పంపే వాతావరణ సమాచారాన్ని గమనిస్తుండాలని సూచించారు. విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవడంతో పాటు, కనీసం ఒక వారానికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు ఉండేలా కిట్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇంటి పైకప్పు, తలుపులు- కిటికీలు సురక్షితంగా ఉన్నయో లేదో తనిఖీ చేయడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
తుపాను సమయంలో ఇంట్లో ఉన్నవారు ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించి, తలుపులు, కిటికీలు గట్టిగా మూసి ఉంచాలన్నారు. ఇల్లు సురక్షితంగా లేదని భావిస్తే ముందే పునరావాస కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు. కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఒకవేళ ఆకస్మికంగా భవనం దెబ్బతినే సూచనలు కనిపిస్తే, బలమైన టేబుల్/బెంచ్ కింద తలదాచుకుని రక్షణ పొందాలన్నారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే ఎత్తైన, సురక్షితమైన ఆశ్రయాలకు తరలివెళ్లాలని కోరారు. ఒకవేళ తుపాను సమయంలో బయట ఉంటే, దెబ్బతిన్న లేదా పాత భవనాల్లోకి వెళ్లకూడదని; చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడరాదని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు షెల్టర్లను వదిలి ఇళ్లకు వెళ్లవద్దన్నారు.
తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాల పట్ల తీవ్ర అప్రమత్తతతో ఉండలన్నారు. నీటిలో తడిసిన లేదా దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించిన తర్వాతే ఉపయోగించాలని స్పష్టం చేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. తమ పడవలు మరియు తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడులతో గట్టిగా కట్టి సురక్షితంగా ఉంచాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
