AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Police: ఏళ్లనాటి సమస్యకు చెక్.. పోలీస్ పదోన్నతులకు లైన్ క్లియర్.. గుడ్‌న్యూస్ చెప్పిన డీజీపీ

రాష్ట్రంలోని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ సూపర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులతో నిలిచిపోయిన ప్రమోషన్లపై అధికారులతో సమావేశమై సాల్వ్ చేసిన ఆయన తొలి విడతలో 54 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. నాన్-క్యాడర్ ఎస్పీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆమోదంతో ఈ ప్రిక్రయను ముందుకు తీసుకెళ్లనున్నారు.

TG Police: ఏళ్లనాటి సమస్యకు చెక్.. పోలీస్ పదోన్నతులకు లైన్ క్లియర్.. గుడ్‌న్యూస్ చెప్పిన డీజీపీ
Telangana Police Promotions
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Nov 17, 2026 | 7:11 PM

Share

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు పరిష్కార మార్గం సుగమమవుతోంది. సీనియారిటీ వివాదాలు, రిజర్వేషన్ ఆఫ్ రోస్టర్ (RoR), ఖాళీలు, అర్హతలకు సంబంధించిన అభ్యంతరాల కారణంగా నిలిచిపోయిన ప్రమోషన్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు డీజీపీ సి.వి. ఆనంద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కోర్టు వివాదాలకు తావులేకుండా అధికారుల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో కీలక ముందడుగు వేశారు.

ఈ క్రమంలో మంగళవారం డీజీపీ కార్యాలయంలో 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సివిల్ ఎస్‌ఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వరంగల్, హైదరాబాద్ రేంజ్‌లతో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ, రోస్టర్ పాయింట్లు, ఖాళీలు, అర్హతలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

తొలి విడతలో 54 మంది డీఎస్పీలకు పదోన్నతులు

డీఎస్పీ స్థాయి అధికారులకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు తొలి విడతలో 54 పోస్టులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండో విడతలో 2027 ఆగస్టు నాటికి మరో 34 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి 1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారుల ప్రమోషన్ ప్యానళ్లను సిద్ధం చేశారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 74 ప్రకారం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నప్పటికీ, సీనియారిటీ అంశంపై కొందరు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక, ప్రభుత్వ ఉత్తర్వులు, సంబంధిత నిబంధనలను సమావేశంలో సమీక్షించారు.

12 మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు

నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టుల భర్తీపైనా సమావేశంలో కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టుల విషయంలో ఎలాంటి న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులు లేకపోవడంతో వాటిని తక్షణమే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. వీటితో పాటు ప్రస్తుత ప్యానల్ ఇయర్‌లో మరో 10 నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. దీంతో అర్హులైన అడిషనల్ ఎస్పీలకు పదోన్నతులు పొందే అవకాశం కలగనుంది.

ఏకాభిప్రాయానికి వచ్చిన అధికారులు

పదోన్నతుల ప్రక్రియలో అందుబాటులో ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హులైన అధికారుల వివరాలను డీజీపీ కార్యాలయ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అధికారుల సర్వీసు కాలం, సీనియారిటీ, రోస్టర్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తొలి, రెండో విడత ప్రమోషన్ జాబితాలను రూపొందించారు. ప్రతిపాదిత పదోన్నతుల జాబితాలపై అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం ప్రతిపాదనల ప్రకారం ముందుకు వెళ్లేందుకు సమావేశంలో పాల్గొన్న అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు పరిష్కారం లభించే అవకాశాలు మెరుగయ్యాయి.

సీఎం దృష్టికి పదోన్నతుల అంశం

సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని డీజీపీ సి.వి. ఆనంద్ వెల్లడించారు. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులు దీర్ఘకాలం కొనసాగితే చివరకు అందరికీ నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పదవీ విరమణకు చేరువలో ఉన్న అధికారులు పదోన్నతి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి అధికారికి న్యాయం జరగాలన్నదే పోలీసు శాఖ లక్ష్యమని, అదే సమయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారమే పదోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించిన అధికారులు పదవీ విరమణకు ముందే పదోన్నతి పొందితే వారికి తగిన గుర్తింపు, సంతృప్తి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

డీజీపీ చొరవతో కొలిక్కి

ఏళ్ల తరబడి వివాదాలు, న్యాయపరమైన చిక్కులతో నిలిచిపోయిన పోలీసు అధికారుల పదోన్నతుల వ్యవహారం డీజీపీ సి.వి. ఆనంద్ చొరవతో పరిష్కార దిశగా సాగుతోంది. అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం, ప్రతిపాదిత జాబితాలపై అంగీకారం వ్యక్తం కావడం ఈ ప్రక్రియలో కీలక పరిణామంగా మారింది. ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే పదోన్నతుల ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us