AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓవైపు నీళ్ల పంచాయితీ.. మరోవైపు రాజకీయ పలకరింపులు.. తమిళనాట మేకదాటు రచ్చ..

మేకదాటు ప్రాజెక్టు కర్ణాటక, తమిళనాడు మధ్య చిచ్చు పెడుతోంది. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించడం కొత్త వివాదానికి తెరలేపింది. సోనియా గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తమిళనాడు సీఎం విజయ్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ హాజరయ్యారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణ కూడా జరిగింది. దీంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి విజయ్‌ వ్యవహరించారని బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే కూడా విజయ్‌ తీరును తప్పుబడుతున్నాయి.

ఓవైపు నీళ్ల పంచాయితీ.. మరోవైపు రాజకీయ పలకరింపులు.. తమిళనాట మేకదాటు రచ్చ..
Mekedatu Dam Dispute
Siva Nagaraju
| Edited By: |

Updated on: Nov 17, 2026 | 9:23 PM

Share

కర్ణాటకలోని కావేరీ నదిపై మేకదాటు దగ్గర భారీ జలాశయం నిర్మించాలని అక్కడి ప్రభుత్వం ప్రతిపాదించింది. బెంగళూరుతో పాటు పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. నీటిని నిల్వ చేయడంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని కర్ణాటక భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 67 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రతిపాదించింది. తాగునీటి అవసరాలకు 4.75 టీఎంసీలు వినియోగించాలని ప్రణాళికలో పేర్కొంది. సుమారు 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తమిళనాడు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జలాశయం నిర్మిస్తే తమకు వచ్చే కావేరీ నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా డెల్టా ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు దెబ్బతింటాయని వాదిస్తోంది. కర్ణాటకకు నీటి నిల్వ అవసరం. తమిళనాడుకు నీటి ప్రవాహంపై భరోసా కావాలి. ఈ రెండు వాదనల మధ్యే మేకదాటు వివాదం కొనసాగుతోంది.

తమిళనాడు అభ్యంతరాలు

కావేరీ నదిపై ఎగువ ప్రాంతంలో కర్ణాటక జలాశయం నిర్మిస్తే నీటి నిల్వ, విడుదలపై ఆ రాష్ట్రానికి మరింత నియంత్రణ లభిస్తుందని తమిళనాడు భావిస్తోంది. దీనివల్ల తమకు కేటాయించిన నీటి వాటా అందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని వాదిస్తోంది. కావేరీ డెల్టాలో వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రాంత రైతులు నదీ జలాలపైనే ఆధారపడుతున్నారు. నీటి విడుదలలో ఆలస్యం జరిగినా పంటలపై ప్రభావం పడుతుంది. అందుకే మేకదాటు నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తమిళనాడు పట్టుబడుతోంది.

కర్ణాటక వాదన

మరోవైపు కర్ణాటక తన ప్రతిపాదనను సమర్థిస్తోంది. బెంగళూరు నగరం వేగంగా విస్తరిస్తుండటంతో తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయని చెబుతోంది. భవిష్యత్తులో నీటి కొరత రాకుండా జలాశయం ఉపయోగపడుతుందని వివరిస్తోంది. వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకోవచ్చని అంటోంది. తమిళనాడుకు కేటాయించిన 177.25 టీఎంసీల నీటిని విడుదల చేసే బాధ్యతను తాము పాటిస్తామని చెబుతోంది. జలాశయం వల్ల తమిళనాడుకు కూడా ప్రయోజనం ఉంటుందని కర్ణాటక వాదిస్తోంది. అయితే ఈ వాదనలను తమిళనాడు అంగీకరించడం లేదు. నీటి వాటా కేటాయింపులు ఉన్నప్పటికీ.. అదనపు జలాశయం వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బందులు రావచ్చని ఆందోళన చెందుతోంది.

విజయ్‌ వేదికతో వివాదం

మేకదాటు విషయంలో తమిళనాడు అభ్యంతరాలు కొనసాగుతున్న సమయంలో విజయ్‌ కర్ణాటక సీఎంతో ఒకే వేదికపై కనిపించడం వివాదానికి కారణమైంది. సోనియా గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇద్దరూ కలుసుకున్నారు. ఈ భేటీలో కావేరీ జలాల అంశాన్ని విజయ్‌ ప్రస్తావించారా లేదా అన్నది కూడా చర్చకు వచ్చింది. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయంలో రాజకీయ మర్యాదలకే ప్రాధాన్యం ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శించాయి.

బీజేపీ విమర్శల దాడి

విజయ్‌ ఢిల్లీ పర్యటనపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ముందుగా మేకదాటు ప్రాజెక్టుపై తన వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేయాల్సిందని బీజేపీ నేతలు అంటున్నారు. కర్ణాటక సీఎం ప్రాజెక్టు నిర్మాణంపై పట్టుదలగా ఉన్న సమయంలో విజయ్‌ ఆయనతో స్నేహపూర్వకంగా కనిపించడం తప్పు సంకేతాలు ఇస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజకీయ రాజీలు ఉండకూడదని బీజేపీ వాదిస్తోంది. ఈ ఘటనను విజయ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉపయోగించుకుంటోంది.

డీఎంకే, అన్నాడీఎంకే గురి

బీజేపీతో పాటు తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షాలు కూడా విజయ్‌పై విమర్శలు పెంచాయి. డీఎంకే నేతలు విజయ్‌ మేకదాటు సమస్యను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి ఉమ్మడి వైఖరిని ప్రకటించాలని మాజీ సీఎం స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. మేకదాటు విషయంలో రాజకీయాలకు అతీతంగా తమిళనాడు ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే కూడా విజయ్‌ తీరును తప్పుబట్టింది. కాంగ్రెస్‌ మద్దతుపై ఆధారపడటం వల్లే కర్ణాటక విషయంలో గట్టిగా మాట్లాడలేకపోతున్నారని విమర్శించింది. రాష్ట్ర హక్కుల కంటే ముఖ్యమంత్రి పదవికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించింది.

విజయ్‌ వివరణ

మరోవైపు విజయ్‌ కూడా ఈ వివాదంపై స్పందించారు. కావేరీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో కర్ణాటకకు వెళ్లాలని భావించినట్లు తెలిపారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం అవమానాలు ఎదురైనా భరించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. కావేరీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మేకదాటు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రంతో చర్చలు జరపడం తప్పు కాదని, సమస్యకు పరిష్కారం కనుగొనడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వివాదం కేవలం వేదిక పంచుకున్న అంశం నుంచి, విజయ్‌ రాజకీయ వైఖరి చుట్టూ తిరిగే చర్చగా మారింది.

కాంగ్రెస్‌ సమర్థన

విజయ్‌ తీరును కాంగ్రెస్‌ నేతలు సమర్థించారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఆహ్వానం మేరకే ఆయన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ తెలిపారు. ఒక కార్యక్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడాన్ని నీటి వివాదంతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. బీజేపీ, డీఎంకే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నాయని విమర్శించారు. అయితే కాంగ్రెస్‌ సమర్థనతో వివాదం సద్దుమణగలేదు. తమిళనాడు హక్కుల విషయంలో విజయ్‌ మరింత స్పష్టంగా వ్యవహరించాలన్న డిమాండ్‌ కొనసాగుతోంది.

కోర్టు.. కేంద్రం.. అనుమతులు

మేకదాటు వివాదం రాజకీయాలకే పరిమితం కాలేదు. న్యాయపరంగానూ కొనసాగుతోంది. 2018లో కావేరీ జలాల పంపిణీపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడుకు ఏటా 177.25 టీఎంసీల నీరు కేటాయించింది. 2025 నవంబర్‌లో మేకదాటు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ తయారీ అనుమతిపై తమిళనాడు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చిందని కాదు. 2026 జూన్‌లో కేంద్ర జల సంఘం కర్ణాటక సమర్పించిన డీపీఆర్‌ను తిరిగి పంపింది. కావేరీ జలాల కేటాయింపులకు అనుగుణంగా మార్పులు చేయాలని సూచించింది. అంటే ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా అనేక అనుమతుల ప్రక్రియలు మిగిలే ఉన్నాయి.

రైతుల బతుకులతో ముడిపడి..

ఈ వివాదంలో అసలైన ఆందోళన రైతులదే. కావేరీ నీరు సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతింటాయి. సాగు ఖర్చులు పెరుగుతాయి. రైతుల ఆదాయంపై ప్రభావం పడుతుంది. తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతం వ్యవసాయానికి ఎంతో కీలకం. కర్ణాటకలోనూ తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలు నిజమైనవే అయినప్పటికీ.. నీటి పంపిణీలో ఎవరికీ అన్యాయం జరగకూడదు. నీటి చుక్క రైతుకు జీవం. రాజకీయ నాయకుడికి అది కేవలం ఎన్నికల అంశం కాకూడదు.

విజయ్‌కు రాజకీయ పరీక్ష

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కు ఇది కీలకమైన పరీక్షగా మారింది. ప్రజాదరణ సంపాదించడం ఒక ఎత్తు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడం మరో ఎత్తు. ఒకవైపు కాంగ్రెస్‌ నేతలతో రాజకీయ సంబంధాలు కొనసాగించాలి. మరోవైపు కర్ణాటకతో నీటి వివాదంలో తమిళనాడు ప్రయోజనాలను కాపాడాలి. ఈ రెండింటి మధ్య సమతూకం పాటించడం విజయ్‌కు సవాలుగా మారింది. ముఖ్యంగా మేకదాటు విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో రాజకీయంగా ప్రభావం చూపనున్నాయి.

మేకదాటు వివాదం ఇప్పుడు నీటి సమస్యను దాటి రాజకీయ పోరాటంగా మారింది. కర్ణాటక తన ప్రాజెక్టు కోసం పట్టుబడుతోంది. తమిళనాడు తన నీటి హక్కుల కోసం పోరాడుతోంది. మధ్యలో విజయ్‌ రాజకీయ వైఖరి చర్చనీయాంశంగా మారింది. బీజేపీ విమర్శలు. డీఎంకే, అన్నాడీఎంకే ఆరోపణలు. కాంగ్రెస్‌ సమర్థనతో వ్యవహారం మరింత వేడెక్కింది. రాజకీయ బంధాలు మారుతుంటాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం. మేకదాటు విషయంలో విజయ్‌ మాటలకు, చేతలకు మధ్య స్పష్టత కనిపించాల్సి ఉంది. తమిళనాడు నీటి హక్కుల కోసం ఆయన ఎంత బలంగా నిలబడతారన్నదే ఈ రాజకీయ వివాదంలో కీలకంగా మారనుంది.

కొండవీటి శివనాగరాజు

డిప్యూటీ అవుట్ ఫుట్ ఎడిటర్, టీవీ9.

Follow Us