AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ కాల్స్‌కు స్పందించలేదని భర్తపై కేసు పెట్టిన భార్య.. హైకోర్టు సంచలన తీర్పు..!

భార్య ఫోన్ చేస్తే భర్త కాల్ లిఫ్ట్ చేయలేదని కేసు పెట్టవచ్చా? ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడం మానసిక వేధింపుల కిందకు వస్తుందా? భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించి కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేవలం ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సరైన ఆధారాలు లేకుండా భర్తపై క్రూరత్వం ఆరోపణలు చేస్తే భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 498A కింద కేసు కొనసాగించలేమని పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఫోన్ కాల్స్‌కు స్పందించలేదని భర్తపై కేసు పెట్టిన భార్య.. హైకోర్టు సంచలన తీర్పు..!
Calcutta High Court
Balaraju Goud
|

Updated on: Nov 17, 2026 | 1:56 PM

Share

భార్య ఫోన్ చేస్తే భర్త కాల్ లిఫ్ట్ చేయలేదని కేసు పెట్టవచ్చా? ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడం మానసిక వేధింపుల కిందకు వస్తుందా? భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించి కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేవలం ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సరైన ఆధారాలు లేకుండా భర్తపై క్రూరత్వం ఆరోపణలు చేస్తే భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 498A కింద కేసు కొనసాగించలేమని పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. 2017 మార్చిలో ఓ జంటకు వివాహం జరిగింది. అయితే పెళ్లైనప్పటి నుంచి తన భర్త, అతని కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని భార్య ఆరోపించింది. తన అత్త, ఆడపడుచు ఇంటి పనులు చేయించేవారని, భర్త కూడా తనను వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో 2020 డిసెంబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని బాగ్నన్ పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు IPC సెక్షన్ 498A సహా సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు.

అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ భర్త కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అజయ్ కుమార్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య చేసిన ఆరోపణలు సాధారణంగా ఉన్నాయని, కానీ నిర్దిష్టమైన వివరాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో, ఏ విధంగా వేధింపులకు గురిచేశారో ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొనలేదని తెలిపింది. అంతేకాకుండా, వరకట్నం కోసం వేధించినట్లు లేదా భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా భర్త ప్రవర్తించినట్లు నిర్దిష్ట ఆధారాలు లేవని పేర్కొంది. కేవలం ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడం, ఫోన్‌లో మాట్లాడకపోవడం మాత్రమే IPC సెక్షన్ 498A కింద క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

సెక్షన్ 498A ఏం చెబుతోంది?

భర్త లేదా అతని బంధువులు భార్యను తీవ్రమైన శారీరక, మానసిక హింసకు గురిచేయడం లేదా చట్టవిరుద్ధమైన ఆస్తి, వరకట్న డిమాండ్ల కోసం వేధించడం వంటి చర్యలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. అయితే ఆరోపణలకు తగిన వివరాలు, ఆధారాలు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భర్తపై నమోదైన క్రిమినల్ కేసును కొనసాగించేందుకు తగిన ఆధారాలు లేవని భావించిన హైకోర్టు, కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రస్తుతం భార్యాభర్తల మధ్య నమోదవుతున్న క్రూరత్వం కేసుల విషయంలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us