AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ గ్రూప్‌ కంపెనీలో 2,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు!

కర్ణాటకలో పారిశ్రామిక రంగానికి భారీ ఊతం లభించనుంది. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన క్యాంపా కోలా (Campa Cola) పానీయాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు విజయపుర జిల్లాలో అడుగులు పడ్డాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ గ్రూప్‌ కంపెనీలో 2,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు!
Reliance Karnataka Campa Cola Plant
Srilakshmi C
|

Updated on: Nov 17, 2026 | 11:30 AM

Share

కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి, విజయపుర జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఎం.బి. పాటిల్ నవంబర్ 16న విజయపుర శివారులోని ములవాడ్ పారిశ్రామిక ప్రాంతంలో క్యాంపా కోలా తయారీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. సుమారు 109 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,600 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. మరో 3,000 మందికి పైగా పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని మంత్రి ఎం.బి. పాటిల్ వెల్లడించారు. విజయపుర జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2009లోనే ములవాడ్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం 3,000 నుంచి 4,000 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, చాలా కాలం పాటు అక్కడ పరిశ్రమలు ప్రారంభం కాలేదని మంత్రి తెలిపారు. పరిశ్రమల శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయపుర జిల్లాకు పెట్టుబడులను తీసుకురావడాన్ని సవాలుగా స్వీకరించి గత మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

క్యాంపా కోలా ప్లాంట్‌లో ఉద్యోగ నియామకాల విషయంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి రిలయన్స్ సంస్థను కోరారు. ముఖ్యంగా ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత పరిశ్రమకు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి, అనంతరం విజయపుర జిల్లా అభ్యర్థులకు అవకాశాలు కల్పించాలని కోరారు. కేటగిరీ C, D ఉద్యోగాలన్నింటినీ స్థానికులతోనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. విజయపుర జిల్లాకు మరిన్ని పరిశ్రమలను తీసుకురావడానికి ప్రభుత్వం 20కి పైగా కంపెనీలతో చర్చలు జరుపుతోందని మంత్రి వెల్లడించారు. ఈ కంపెనీల్లో టెర్రా సర్క్యూట్స్ రూ.444 కోట్లు, జెనిత్ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.90 కోట్లు, హైటెక్ పైప్స్ రూ.250 కోట్లు, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ రూ.300 కోట్లు, సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ రూ.300 కోట్లు, వింగ్స్ విటెర్రా రూ.350 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.

ఈ సంస్థలకు ములవాడ్ పారిశ్రామిక ప్రాంతంలో భూములు కేటాయించనున్నట్లు చెప్పారు. జిల్లాలో కనీసం 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. విజయపుర జిల్లాలో దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష వంటి ఉద్యాన పంటలకు మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసి కార్యకలాపాలను విస్తరించాలని రిలయన్స్ సంస్థను కోరారు. పరిశ్రమలకు అవసరమైన పంటలను పండించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, ముడిసరుకుల కొరత ఉండదని పేర్కొన్నారు. గతంలో నీటి వసతులు సరిగా లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు వెనుకంజ వేశారని, ప్రస్తుతం చెరువులు, రిజర్వాయర్లలో నీటిని నింపడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఆధ్వర్యంలో మైసూర్ శాండల్ సోప్ తయారీ యూనిట్ కూడా త్వరలో విజయపుర జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభించనుందని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

బెంగళూరు పరిసర ప్రాంతాలకే పరిమితం కాకుండా కర్ణాటకలోని ఇతర జిల్లాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు చట్టబద్ధమైన పరిహారానికి మించి అవసరమైన చోట న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎం.బి. పాటిల్ స్పష్టం చేశారు. రూ.1,600 కోట్ల క్యాంపా కోలా ప్రాజెక్టుతో విజయపుర జిల్లాలో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు రానుండగా, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

Follow Us