AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు తండ్రులు.. రెండు కన్నీటి కథలు.. ఒకరి కూతురి మందులు.. మరొకరి కుటుంబం ఆకలి

ఇద్దరు తండ్రులు.. రెండు కన్నీటి కథలు.. ఒకరి కూతురి మందులు.. మరొకరి కుటుంబం ఆకలి

Phani CH
|

Updated on: Nov 16, 2026 | 7:10 PM

Share

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో జరిగిన రూ.5 వేల దొంగతనం వెనుక ఇద్దరు తండ్రుల కన్నీటి కథ దాగి ఉంది. అనారోగ్యంతో ఉన్న కూతురి మందుల కోసం ఓ వ్యక్తి డబ్బు దొంగిలించగా, మరో వ్యక్తి పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చుల కోసం దాచుకున్న నగదును పోగొట్టుకున్నాడు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.

ఒక తండ్రికి కూతురి మందులు కొనాలి.. మరో తండ్రికి పిల్లల ఫీజులు కట్టాలి! కానీ ఈ ఇద్దరి జీవితాల్లో ఓ చిన్న సంఘటన పెద్ద విషాదాన్ని మిగిల్చింది! ఒకరు తన కూతురి కోసం మందులు కొనలేక అల్లాడిపోయారు.. మరొకరు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన రూ.5 వేలు పోగొట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు! ఇంకా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ ఇద్దరి కష్టాల వెనుక ఉన్నది ఒక్కటే.. పేదరికం! అసలు హైదరాబాద్‌లో ఏం జరిగింది? బంజారాహిల్స్‌లో జరిగిన ఈ ఘటనలో సయ్యద్ సాధిక్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. గతంలో ఇతడిపై పలు దొంగతనం కేసులు ఉన్నాయి. 2008 తర్వాత నేరాల బాట వదిలేసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. భార్య, నలుగురు కుమార్తెలు.. ఇదీ అతడి కుటుంబం. అయితే ఇటీవల ఓ కుమార్తె అనారోగ్యానికి గురైంది. మందులు కొనాలి.. వైద్య ఖర్చులు భరించాలి. కానీ చేతిలో డబ్బుల్లేవు! తెలిసినవాళ్లను అప్పు అడిగినా సాయం అందలేదు. చివరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అక్కడే అతడు తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం.. మరో కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది! ఈ నెల 10న జలగం వెంగళరావు పార్కు దగ్గర బైక్‌పై వెళ్తున్న మహ్మద్ నూరుల్లాఖాన్‌ను సాధిక్ గమనించాడు. ఆయన బైక్‌లో పెట్రోల్ లీక్ అవుతూ ఉండటంతో.. ఆ విషయాన్ని చెప్పాడు. దీంతో నూరుల్లాఖాన్ బైక్ ఆపి సమస్యను చెక్ చేసుకుంటున్నారు. అంతే.. ఇదే అదనుగా భావించిన సాధిక్ ఆయన దృష్టి మరల్చి జేబులో ఉన్న రూ.5 వేలు కొట్టేశాడు! కానీ ఆ ఐదు వేల వెనుక మరో తండ్రి కష్టం ఉందని అతడికి తెలుసో లేదో! నూరుల్లాఖాన్ జీహెచ్‌ఎంసీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇంటి ఖర్చుల కోసం, పిల్లల ఫీజుల కోసం భార్యకు ఇవ్వాలని తీసుకెళ్తున్నారు. కానీ ఇంటికి వెళ్లాక జేబులో డబ్బులు కనిపించలేదు! ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తన దగ్గర ఉన్నది కేవలం ఐదు వేలే అని.. అవి పోవడంతో కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సాధిక్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పిన విషయం పోలీసులను కూడా కదిలించింది. తన కుమార్తెకు మందులు కొనడానికే దొంగతనం చేశానని చెప్పాడు. 18 ఏళ్ల తర్వాత మళ్లీ నేరం చేయాల్సి వచ్చిందని వాపోయాడు. దొంగిలించిన రూ.5 వేలలో రూ.1,200తో కూతురికి మందులు కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అతడి ఇంట్లో మందుల చీటీ, మాత్రలను కూడా పోలీసులు గుర్తించారు. తాను జైలుకు వెళ్తే భార్య, నలుగురు కుమార్తెల పరిస్థితి ఏంటని.. తనపై కేసు నమోదు చేయవద్దని వేడుకున్నట్లు సమాచారం. ఇక్కడే ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది! ఒక తండ్రి తన కూతురి ప్రాణం కోసం అల్లాడుతున్నాడు. మరో తండ్రి తన పిల్లల ఆకలి తీర్చడం కోసం కష్టపడుతున్నాడు. ఇద్దరిదీ కుటుంబం కోసమే పోరాటం. ఇద్దరిదీ పేదరికంతో యుద్ధమే! కానీ ఒకరి అవసరం కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయం.. మరొకరి కుటుంబాన్ని రోడ్డున పడేసే పరిస్థితి తెచ్చింది. అవును.. పేదరికం బాధాకరమే. నిస్సహాయత ఇంకా బాధాకరమే. కానీ అవసరం ఎంత పెద్దదైనా దొంగతనం సరైన మార్గం కాదు. ఎందుకంటే మన కష్టాన్ని తీర్చుకోవడానికి చేసే తప్పు.. ఇంకొకరి జీవితంలో కన్నీళ్లను నింపొచ్చు! ఈ ఘటనలో దొంగిలించబడింది కేవలం రూ.5 వేలు కాదు.. ఒక కుటుంబం ఆ నెల గడపడానికి పెట్టుకున్న ఆశ కూడా! కూతురి మందుల కోసం ఓ తండ్రి దొంగగా మారాడు.. పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బును మరో తండ్రి పోగొట్టుకున్నాడు! చివరికి ఇద్దరి ఇళ్లలోనూ మిగిలింది కన్నీళ్లే.. పేదరికం ఇద్దరినీ ఓడించింది.. కానీ ఒకరి కన్నీళ్లకు కారణం మరొకరు కావడం ఈ కథలో అసలైన విషాదం!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ నెంబర్ 1.. ఢిల్లీ, బెంగళూరుది బ్యాక్ బెంచ్.. అసలు నిజమేంటి?

ప్రేమ కాదు.. పిచ్చి! రూ.7 కోట్లతో రూ.4,500 కోట్ల వండర్!

శీతాకాలంలో సంపూర్ణ ఆరోగ్యం.. తప్పక తీసుకోవాల్సిన పోషకాహారాలు ఇవే

పేడతోనే ఇన్ని అద్భుతాలా? 1,140 రెట్ల బలం.. ఈ పురుగు సొంతం! నక్షత్రాలే దీనికి దిక్సూచి

బ్యాంక్ ఖాతా లేకపోయినా మనీ పంపుకోవచ్చు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే

Follow Us