పల్లీలు మంచివని తింటున్నారా..? కొంతమంది అస్సలు తినొద్దు..!
Jyothi Gadda
17 November 2026
ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే పల్లీలు అందరి శరీర తత్వానికి సరిపడవని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా స్పష్టం చేశారు. ఆయుర్వేద నియమాల ప్రకారం సరైన పద్ధతిలో తినకపోతే అనారోగ్య సమస్యలు తప్పవని ఆమె హెచ్చరిస్తున్నారు.
పల్లీలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎంత పోషకాహారమైనా సరే, తినే విధానం తెలియకుండా నిత్యం తీసుకుంటే శరీరంలో పలు రకాల అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి.
పీసీఓఎస్, మొటిమలు, సైనస్, కఫ దోషం, గ్యాస్, అసిడిటీ, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు ఉన్నవారు పల్లీలకు దూరంగా ఉండాలి. వీరు తింటే శరీరంలో 'అమా' పెరిగి సమస్యలు రెట్టింపవుతాయి.
పడని వారు పల్లీలను తిన్నప్పుడు కడుపులో అసౌకర్యంగా ఉండటం, సైనస్ తీవ్రతరం కావడం, కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ పట్టడం, అలాగే ముఖంపై మొటిమలు మరింత ఎక్కువగా రావడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.
వాత తత్వం ఉన్నవారు, శరీర బరువు తక్కువగా ఉన్నవారు, పొడి చర్మం కలిగినవారు, చేతులు, పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండేవారు పల్లీలు తినడం మంచిది. దీనివల్ల చర్మానికి సహజ తేమ అందుతుంది.
పల్లీలను ఇనుప బాణలిలో వేయించి, పైన ఉండే పొట్టును పూర్తిగా తీసేయాలి. ఆ తర్వాత వాటిలో కొద్దిగా ఇంగువ, శొంఠి పొడి లేదా మిరియాల పొడి కలుపుకుని తినడం ఉత్తమం.