AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ వైమానిక దాడులకు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వెల్లడించాయి. ఈ వారాంతంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి..

ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!
Donald Trump , Benjamin Netanyahu
Balaraju Goud
|

Updated on: Aug 01, 2026 | 8:44 AM

Share

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ వైమానిక దాడులకు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వెల్లడించాయి. ఈ వారాంతంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు తుది ఆమోదం ఇవ్వలేదని సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ సైనిక కార్యకలాపాలకు, పాలనా వ్యవస్థకు కీలకంగా ఉన్న విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా దాడి చేయవచ్చని సమాచారం. ఈ దాడుల ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని, ఆర్థిక బలాన్ని బలహీనపరచాలన్నది అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహంగా తెలుస్తోంది. అయితే, అధ్యక్షుడి తుది నిర్ణయం వెలువడకముందు లక్ష్యాలపై వ్యాఖ్యానించేందుకు పెంటగాన్ అధికారులు నిరాకరించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సోమవారం (ఆగస్టు 03) అంతర్జాతీయ మార్కెట్లు ప్రారంభమయ్యేలోపు ఈ ఆపరేషన్‌ను ముగించాలని అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా చమురు ధరలు, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చలు జరిగినప్పటికీ, తుది కాలపరిమితిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇక ఈ ప్రణాళికల గురించి ఇజ్రాయెల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. వాషింగ్టన్‌తో సమన్వయం కొనసాగుతోందని తెలిపినా, ఇరాన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్యలను తిరిగి ప్రారంభించే అంశంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఓ ఇజ్రాయెల్ అధికారి వెల్లడించారు. కొత్త దాడిలో పాల్గొనాలని తమకు ఇప్పటివరకు అధికారిక ఆదేశాలు అందలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం (జూలై 31) క్యాంప్ డేవిడ్‌లో అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సైనిక ప్రణాళికలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. వైట్ హౌస్‌లోని కొందరు అధికారులు దాడులను వ్యతిరేకించినప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్‌పై అత్యంత కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైట్ హౌస్ పునరుద్ఘాటించగా, అధ్యక్షుడు ఆదేశిస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు అమెరికా సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని పెంటగాన్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడి జరిగితే ఇజ్రాయెల్‌లోని కీలక మౌలిక సదుపాయాలతో పాటు మధ్యప్రాచ్యంలోని అమెరికా ఇంధన కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని టెహ్రాన్ స్పష్టం చేసింది. అలాగే హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాపైనా ప్రభావం చూపే చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారగా, ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us