బీఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)గా ఉన్న పార్టీ పేరును.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో ఈ పార్టీని 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును 5 అక్టోబర్ 2022న భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బీఆర్ఎస్ పేరుతో 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో 63 సీట్లలో గెలుపొందిన బీఆర్ఎస్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుంది. కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నం కారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ స్థానాలు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.