KCR: కరెంటు విషయంలో కరెంట్‌ షాక్‌ తగిలే విషయాలు చెప్పిన కేసీఆర్

పవర్‌ పర్చేజుల పేరుతో కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారని అధికార కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అత్యధిక రేట్లకు అడ్డగోలుగా కరెంటు కొనుగోలు చేశారని కేసీఆర్‌ మీద ఆరోపణలు మోపుతోంది కాంగ్రెస్‌. కేసీఆర్‌ హయాంలో...యాదాద్రి-భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌లో పది వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ చెబుతోంది. మరోవైపు ఇప్పుడు తెలంగాణలో కరెంటు కష్టాలకు కారణం కూడా పాత ప్రభుత్వమేనా? ఈ ఆరోపణలకు కేసీఆర్‌ సమాధానం ఏంటి? రజినీకాంత్‌ లైవ్‌ షో విత్‌ కేసీఆర్‌లో, మాజీ సీఎం ఖుల్లం ఖుల్లా మాట్లాడారు. కరెంటు విషయంలో కరెంట్‌ షాక్‌ తగిలే నిజాలు ఆయన చెప్పారా? ఇంతకీ కేసీఆర్‌ ఇచ్చిన ఆన్సర్లతో ఎవరికి మైలేజ్‌? ఎవరికి డ్యామేజ్‌?

KCR: కరెంటు విషయంలో కరెంట్‌ షాక్‌ తగిలే విషయాలు చెప్పిన కేసీఆర్
KCR Exclusive Interview
Follow us

|

Updated on: Apr 24, 2024 | 9:36 AM

తాము అధికారంలోకి వచ్చేనాటికి తెలంగాణలో 2700 మెగావాట్ల పవర్ షార్టేజ్‌ ఉందన్నారు కేసీఆర్‌. పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో పదేళ్ల పాటు 53.89 శాతం తెలంగాణకు ఇవ్వాలి. కానీ అలా జరలేదన్నారు మాజీ సీఎం. తాము అధికారంలోకి రాగానే దారుణంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దామన్నారు కేసీఆర్‌. విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు తెలంగాణను నేషనల్‌ గ్రిడ్‌లో చేర్చేందుకు చాలా కష్టాలు పడ్డామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే కరెంటు కష్టాలను అధిగమించి, 24 గంటల విద్యుత్‌ సరఫరా చేశామన్నారు.

తమ హయాంలో అధిక రేట్లు పెట్టి విద్యుత్‌ కొనుగోలు చేయడం అవాస్తవమన్నారు కేసీఆర్‌. 13 రూపాయలకు యూనిట్‌ కొన్నామని దుష్ప్రచారం చేశారన్నారు ఆయన. తాము కేవలం మూడు రూపాయల 90 పైసలకే కొనుగోలు చేశామని స్పష్టం చేశారు కేసీఆర్. అవసరమైనప్పుడు మాత్రమే, పీక్‌ సీజన్‌లో… తాత్కాలికంగా కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్‌ రేటు పెట్టామని, అది సాధారణంగా అన్ని రాష్ట్రాలు అవలంబించే ప్రక్రియే అని ఆయన తెలిపారు.

ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం…యూనిట్‌కు 13 రూపాయల కంటే ఎక్కువ పెట్టి విద్యుత్‌ కొనుగోలు చేసిందన్నారు కేసీఆర్‌. ఇప్పుడు పవర్‌ షార్టేజ్‌ ఎందుకు వచ్చింది. 2014లో 7700 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి ఉంటే…తాము దిగిపోయేనాటికి దాన్ని 19,100 మెగా వాట్లకు పైగా పెంచామన్నారు కేసీఆర్‌. ‘నేను దిగిపోయిన వెంటనే కరెంటు ఎందుకు బంద్‌ అయింది. తాగు, సాగు నీటి ఇబ్బంది ఎందుకు వచ్చింది. తొమ్మిదేళ్లలో రెప్పపాటు కూడా పోకుండా కరెంటు ఇచ్చాం. ఇప్పుడు ఎందుకు లేద’ని కేసీఆర్‌ ప్రశ్నించారు.

రాష్ట్రాభివృద్ధికి కీలకమైన విద్యుత్‌ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైనందువల్లే విద్యుత్ కొరత వచ్చిందని కేసీఆర్ ఆరోపించారరు. తాను టెక్నోక్రాట్లతో విద్యుత్‌ వ్యవస్థను అద్భుతంగా నిర్మిస్తే…దాన్ని బ్యూరోక్రాట్ల చేతుల్లో పెట్టి కాంగ్రెస్‌ నాశనం చేసిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ పరిపాలనతో రాష్ట్రం పరువు పోయిందని ఆరోపించారు మాజీ సీఎం. తాను హైదరాబాద్‌ను పవర్‌ ఐల్యాండ్‌ చేశానన్నారు కేసీఆర్. అలాగే పవర్ బ్యాంకుని సృష్టించానన్నారు ఆయన. న్యూయార్క్‌, లండన్‌లో అయినా విద్యుత్ కోతలు ఉంటాయేమో కానీ, హైదరాబాద్‌లో పవర్‌ కట్‌ ఉండేది కాదని తాను పారిశ్రామిక వర్గాలతో గర్వంగా చెప్పేవాడినన్నారు కేసీఆర్‌.

తొమ్మిదేళ్ల పాటు 24 గంటల కరెంటును తాను ఎలా ఇవ్వగలిగాను, కాంగ్రెస్‌ ఎందుకు ఇవ్వలేకపోతోంది అని ప్రశ్నించారు కేసీఆర్‌. దీనికి కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలన్నారు ఆయన. ఇక విద్యుత్‌ రంగంలో అక్రమాలు జరిగాయంటున్న కాంగ్రెస్‌ ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని, దానికి తాము సిద్ధమంటూ సవాల్‌ విసిరారు కేసీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Latest Articles