Hyderabad: వరుస దొంగతనాలు.. ఎట్టకేలకు చెక్ పెట్టిన పోలీసులు.. ఎలా పట్టుకున్నారో తెలిస్తే!
హైదరాబాద్ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం ఆరుగురు వ్యక్తులు రాజస్థాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

హైదరాబాద్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుండి ఎనిమిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ రహస్య సమాచారం మేరకు దొంగల ముఠా ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆరుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారం క్రితం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మొబైల్ షాప్‌లోకి చొరబడిన ఈ ఆరుగురి దొంగల ముఠా.. షాప్ షటర్లు ధ్వంసం చేసి దాదాపు తొమ్మిది లక్షల నగదును ఎత్తుకెళ్లినట్టు ఆయన తెలిపారు. సాక్షాదారాలు మాయం చేసేందుకు షాపులో ఉన్న సీసీ కెమెరాలు, డివిఆర్‌ను కూడా నిందితులు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
షాపు యజమాని ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు.. మొదటగా ఈ దొంగతనానికి ఉసిగొల్పిన వ్యక్తిని పట్టుకున్నారు. మొబైల్ షాప్‌లో గతంలో పని చేసి మానివేసిన వ్యక్తే దొంగల ముఠాకు సమాచారం అందించినట్టు పోలీసులు గుర్తించారు. అతని ద్వారా నిందితులు ఉంటున్న సమాచారం తెలసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు.. నేరుగా వాళ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆరుగురి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నిందితులంతా రాజస్థాన్‌కు చెందిన జైసారాం, లీలా రామ్, లక్ష్మణ్ రామ్, జబారా రామ్, పరశురాంతో పాటు గుజరాత్‌కు చెందిన నాగాజీ రామ్‌లుగా గుర్తించారు. ఈ ముఠా సభ్యులు ఇప్పటికే పలు దొంగతనాల్లో నిందితులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు గతంలో మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో జ్యువలరీ లూటీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారని, జువెలరీ షాప్ లూటీలో దాదాపు 5 కోట్ల 79 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు, ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో ఏ1 జైసా రామ్ నిజామాబాద్‌లో కూడా చీటింగ్ కేసు నమోదు అయిందని డీసిపి తెలిపారు.కేసును ఛేదించిన పోలీసులకు డీసీపీ బాలస్వామి రివార్డులను అందజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
