Hyderabad: అటెన్షన్.! రైలు ప్రయాణీకులకు సూపర్ గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో ఆ సర్వీసులు పొడిగింపు..
దక్షిణ మధ్య రైల్వే 44 సమ్మర్ స్పెషల్ రైళ్లను పొడిగించింది. ఏప్రిల్ 10 నుండి 17 వరకు అందుబాటులో ఉండే ఈ రైళ్ల వివరాలు మరియు తిరుపతి భక్తుల కోసం కేటాయించిన ప్రత్యేక సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

ఎండాకాలం వచ్చేసింది.. పిల్లలకు సెలవులు కావడంతో ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ఏకంగా 44 సమ్మర్ స్పెషల్ రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉండటంతో సొంతూళ్లకు వెళ్లాలనుకునే సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా, తాజాగా మరిన్ని అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 10 నుంచి 17 వరకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేశామని తాజాగా విడుదల చేసిన జాబితా తో తెలిపింది.ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, కాచిగూడతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
వేసవిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అత్యధిక రైళ్లను తిరుపతి మార్గంలో కేటాయించారు.అకోలా, చర్లపల్లి, నాందేడ్, నరసాపూర్, పండరీపూర్ వంటి ప్రాంతాల నుంచి తిరుపతికి స్పెషల్ సర్వీసులు నడవనున్నాయి.తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మైసూర్, భువనేశ్వర్ న్యూ, బెలగావి, జాల్నా వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ పొడిగింపు ఊరటనివ్వనుంది.కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా మూడు ట్రిప్పుల చొప్పున అదనపు అవకాశం కల్పించారు. అలాగే కాకినాడ నుంచి మైసూర్ వెళ్లే రైలుకు రెండు ట్రిప్పులు కేటాయించారు. అనకాపల్లి, ధర్మవరం వంటి ప్రాంతాలకు కూడా అదనపు ట్రిప్పులు ఉండనున్నాయి. రద్దీ దృష్ట్యా ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..
