రికార్డ్ స్థాయికి పడిపోయిన రూపాయి! పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో బలహీనపడినా, భారత ఆర్థిక వ్యవస్థ గత సంక్షోభాల కంటే బలంగా ఉందని DSP మ్యూచువల్ ఫండ్ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గడం, ఐటీ ఎగుమతులు, రెమిటెన్సులు రూపాయికి మద్దతుగా నిలుస్తుండటంతో భయాందోళనలు అతిగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదని DSP మ్యూచువల్ ఫండ్ తాజా నివేదిక వెల్లడించింది. మే 20న రూపాయి డాలర్‌కు 96.95 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకి, 96.86 వద్ద ముగిసింది. ప్రస్తుతం రూపాయి సుమారు 95.7 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరగడం, విదేశీ ప్రయాణాలు ఖరీదవడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. అయితే DSP MF నివేదిక ప్రకారం, ప్రస్తుతం రూపాయిపై ఉన్న భయాందోళనలు కొంత అతిశయోక్తిగా మారాయని తెలుస్తోంది.
నివేదికలో ముఖ్యంగా రీయల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ (REER) ఆధారంగా రూపాయి ఇప్పటికే గణనీయంగా బలహీనపడిందని, దీంతో ఇకపై భారీ పతనం సంభావ్యత తగ్గవచ్చని పేర్కొన్నారు. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, 2013 కరెన్సీ సంక్షోభ కాలాల్లో కనిపించిన స్థాయిలకు రూపాయి చేరుకుందని విశ్లేషించారు. ఇక ద్రవ్యోల్బణ పరంగా కూడా పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని నివేదిక చెబుతోంది. గత ఏడాది భారతదేశంలో ద్రవ్యోల్బణం సగటు 2.3 శాతం ఉండగా, అమెరికాలో అది 2.8 శాతంగా నమోదైంది. దీని వల్ల దీర్ఘకాలంలో రూపాయి విలువ క్షీణత వేగం తగ్గవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా ఐటీ సేవల ఎగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల నుంచి వచ్చే రెమిటెన్సులు వంటి అంశాలు భారత విదేశీ మారక నిల్వలకు బలంగా నిలుస్తున్నాయని నివేదిక తెలిపింది. అధిక బంగారం ధరల కారణంగా దిగుమతులు తగ్గడం కూడా కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక భారత స్టాక్ మార్కెట్‌లో అనేక లార్జ్ క్యాప్ షేర్లు ఇప్పుడు ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడవుతున్నాయని DSP MF విశ్లేషించింది. కేవలం రూపాయి బలహీనత ఆధారంగా పెట్టుబడిదారులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
