అబ్బబ్బ.. పుల్లగా కారంగా.. పల్లెటూరి స్టైల్లో చింత చిగురు, చికెన్ కర్రీ.. ఇదొక్కటి వేస్తే తెపాళ్ల లేపుతారు..
ఆదివారం వచ్చిందంటే చాలామంది నాన్‌వెజ్ ప్రియుల ఇంట్లో చికెన్ కర్రీ వాసన తప్పనిసరిగా వస్తుంది. అయితే సాధారణ చికెన్ కర్రీలకు భిన్నంగా.. చింతచిగురు చికెన్‌కు ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటాయి. పుల్లగా, కారంగా ఉండే ఈ ఆంధ్రా స్టైల్ చింతచిగురు కోడి కూర వేడి అన్నంతో తింటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. చింతచిగురులోని ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేయగా.. చికెన్‌లోని ప్రోటీన్ శరీరానికి బలాన్ని అందిస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఈ స్పెషల్ కాంబినేషన్ ఇప్పుడు ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ తెచ్చుకుని ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ కర్రీ, ఫ్రైతో పాటు.. పలు రకాల కాంబినేషన్లలో వండుకుని ఆస్వాదిస్తారు. అలాంటి సూపర్ కాంబినేషన్ లో చింత చిగురు కోడి కూర ఒకటి.. పుల్లగా కారంగా ఉండే.. ఈ సూపర్ కాంబినేషన్ చికెన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఆంధ్రాస్టైల్ లో చింత చిగురు చికెన్ కర్రీ వండుకుంటే లొట్టలేసుకుంటూ మరి తింటారు. ఎంతో రుచికరమైన – ఆరోగ్యకరమైన చింతచిగురు చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ కూర ప్రత్యేకంగా ఈ సీజన్ లో లభించే చింతచిగురుతో తయారుచేస్తారు. ఇది వంటకానికి ఒక ప్రత్యేకమైన పులుపును – సువాసనను ఇస్తుంది. అంతేకాకుండా, చింతచిగురు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది, కీళ్ల నొప్పులను ఉపశమిస్తుంది. శరీరంలో కొవ్వును కూడా తగ్గిస్తుంది. చింత చిగురులో ఫైబర్, విటమిన్లు – ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకుండా.. చికెన్ లోని ప్రోటీన్.. పోషకాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి..
చింత చిగురు చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు:
చికెన్: సరిపడేంతగా తీసుకోవాలి..
చింతచిగురు: కిలోకి 200 గ్రాముల చొప్పున తీసుకోవచ్చు..
నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, కారం, ఉప్పు, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా పొడి
తయారీ విధానం:
1. ముందుగా, ఒక కడాయిలో సరిపోయేంతగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
2. ఉల్లిపాయలు వేగిన తర్వాత, పావు టీ స్పూన్ పసుపు, ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి.
3. ఇప్పుడు, శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ను కడాయిలో వేయాలి. చికెన్ లోని నీరంతా ఇంకిపోయేంత వరకు, రెండు నుండి మూడు నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి.
4. తరువాత, ధనియాల జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి.
5. తగినంత నీరు (చికెన్ మునిగేంత వరకు, సుమారు ఒకటిన్నర నుండి రెండు గ్లాసులు) రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. హై ఫ్లేమ్ లో ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించాలి.
6. ఒకసారి బాయిల్ వచ్చాక, మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో 15 నుండి 20 నిమిషముల పాటు చికెన్ ను ఉడికించాలి. చికెన్ మెత్తబడి, కొద్దిగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
7. ఈలోగా, చింతచిగురును సిద్ధం చేసుకోవాలి. శుభ్రం చేసి, పెద్ద కాడలు తీసేసిన చింతచిగురును రెండు చేతులతో బాగా నలుపుకోవాలి. ఇలా నలుపుకోవడం వల్ల కాడలు సులువుగా బయటకు వస్తాయి. ముదురు కాడలను తప్పనిసరిగా తొలగించాలి, ఎందుకంటే అవి ఉడకవు. కూరలో వేసే ముందు మాత్రమే చింతచిగురును నలుపుకోవాలి, ముందుగానే నలిపి ఉంచితే పసర వాసన వస్తుంది. అరకిలో 100 గ్రాముల చొప్పున చింతచిగురు సరిపోతుంది. పులుపు ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం వేసుకోవచ్చు.
8. చికెన్ ఉడికిన తర్వాత, నలిపిన చింతచిగురును కూరలో వేసి బాగా కలపాలి. మూత పెట్టి మరో ఐదు నిమిషముల పాటు ఉడికించాలి, దీనివల్ల చింతచిగురు పులుపు చికెన్ కు పట్టి కూర మరింత దగ్గరగా అవుతుంది.
9. చివరగా, అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సమయంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసి, కావాలంటే కొద్దిగా ఉప్పు వేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయవచ్చు.
ఈ రుచికరమైన చింతచిగురు చికెన్ ఇగురును వేడి వేడి అన్నంతో తిన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. చింతచిగురు వలన కూరకు మంచి సువాసన వస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
