Hyderabad: తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. అందుబాటులోకి రానున్న నాగోల్ ఫ్లై ఓవర్.. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా..
జంట నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు కొద్దికొద్దిగానైనా తీరబోతున్నాయి. సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎప్పటికప్పుడు అడుగులు పడుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా..

జంట నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు కొద్దికొద్దిగానైనా తీరబోతున్నాయి. సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎప్పటికప్పుడు అడుగులు పడుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ మరో ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇవాళ (బుధవారం) మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రజలకు అంకితం కాబోతోంది నాగోల్ ఫ్లైఓవర్. యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, ప్రాజెక్ట్‌తో కలిపి ఈ ఫ్లైఓవర్‌కి మొత్తం రూ.143 కోట్ల 58లక్షలు ఖర్చయింది. 990 మీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ను 6 లేన్స్ అండ్ బై డైరెక్షన్‌తో నిర్మించారు. నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఎలాంటి సిగ్నల్ లేకుండా రయ్‌రయ్‌మంటూ వాహనాలు దూసుపోవచ్చు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వెళ్లేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
హైదరాబాద్‌లో మెరుగైన రవాణాయే లక్ష్యంగా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ.. ఎస్ఆర్డీపీ కింద మొత్తం 47 పనులు చేపట్టింది. ఇప్పటివరకు 31 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. మరో 16 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. కంప్లీటైన 31 పనుల్లో 15 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వరసలో నాగోల్ ఫ్లైఓవర్ 16వది. సిటీలోకి ఎంటరవ్వాలంటే ఎక్కువమందికి ఇదే కీలక మార్గం.
ఫ్లై ఓవర్ల పరంపర ఇక్కడితోనే ఆగిపోలేదు. మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు త్వరలో మరో రెండు ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్, మరొకటి శిల్పా లేఅవుట్ బ్రిడ్జ్. ఈ రెండింటి పనులు పూర్తికావొస్తున్నాయ్. వీటిని కూడా డిసెంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఇవాళయితే… నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతోంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..