Andhra Pradesh: అమరావతి రైతుల పాదయాత్ర ఇక ముగిసినట్టే.. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..
అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఇక వారి పాదయాత్ర కొనసాగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు.

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఇక వారి పాదయాత్ర కొనసాగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. విజయనగరంలో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్ర ఆగిపోయినట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఈ పాదయాత్రను టీడీపీ వెనకుండి నడిపిస్తోందని ఆరోపించారు మంత్రి బొత్స. పాదయాత్రలో ఎంతమంది ఉన్నారు? అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు అడిగిందన్నారు. 600 మందితో వస్తున్న పాదయాత్రలో 60 మంది కూడా రైతులు లేరని ఆయన ఆరోపించారు. ఆ పాదయాత్రలో అసలైన రైతులు లేరని, టీడీపీ ముసుగులో ఉన్న అమరావతి రైతులు తమ పాదయాత్రను ఆపేశారని పేర్కొన్న బొత్స.. విశాఖ పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని అన్నారు. త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామన్నారు.
వచ్చే నెలలో బోగాపురం ఎయిర్ పోర్ట్, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధాన మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష విశాఖ పరిపాలనా రాజధాని ఇక సాకారం అయినట్లేనని అన్నారు మంత్రి బొత్స. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి ఉన్న అడ్డంకులు అన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..