Rythu Bharosa: రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజు నుంచే అకౌంట్లోకి.. అంతా సిద్దం
రైతు భరోసా నిధులు సంక్రాంతికి జమ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ శాటిలైట్ సర్వే రిపోర్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడం, సాగు భూములను గుర్తించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో నిధుల విడుదల ఆలస్యమవుతోంది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది.

Rythu Bharosa Funds: తెలంగాణలోని రైతులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో నవంబర్‌లో రబీ సీజన్ మొదలవ్వగా.. ఆ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇంకా అందించలేదు. దీంతో పంట సాగుకు కావాల్సిన డబ్బులు లేక రైతులు అప్పులు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సాయం వస్తే తమకు నిధుల కోరత ఉండదని రైతులు చెబుతుండగా.. రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈ రోజు నుంచి అకౌంట్లోకి..
రైతు భరోసా నిధులను సంక్రాంతి పండగ సందర్భంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తొలుత భావించింది. జనవరి 13 నుంచి జమ చేయాలని తొలుత నిర్ణయించింది. పండక్కి ఇవ్వడం వల్ల రైతుల ఆనందం రెట్టింపు అవుతుందని అనుకుంది. ఈ మేరకు సంక్రాంతి కల్లా నిధులు జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల నిధుల విడుదల ఆలస్యమవుతోంది. తాజా సమాచారం ప్రకారం జనవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయనుందని సమాచారం. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీ నుంచి నిధులు రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సారి రైతు భరోసా పథకంలో కోతల విధింపునకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం ఈ పథకం అమలు, అర్హతపైన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకే మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తోంది.
శాటిలైట్ సర్వే వల్ల జాప్యం
శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. శాటిలైట్ సర్వే వివరాలు ఇప్పటికే కంప్యూటర్లలో స్టోర్ అవ్వగా.. వాటిల్లో పంట సాగులో ఉన్న భూములను గుర్తించే ప్రక్రియ షురూ అయింది. ఈ ప్రాసెస్ పూర్తవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నందున చాలామంది అనర్హలుగా తేలనున్నారు. జనవరి 26 నుంచి మొదలుకానున్న రైతు భరోసా నిధుల ప్రక్రియ 10 రోజుల పాటు సాగనుంది. ఇప్పటికే ఎంత నిధులు అవసరమవుతాయనేది ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్ధికశాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేవించారు.
