Virat Kohli : బ్యాటింగ్ లోనే కాదు..యాక్టింగ్ లోనూ కోహ్లీయే తోపు..భయ్యా నీలో ఈ టాలెంటు కూడా ఉందా ?
Virat Kohli : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముందు వడోదరలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ, అర్ష్‌దీప్ సింగ్ రన్నింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ సందడి చేశాడు. ఈ వీడియో చూసి రోహిత్ శర్మ నవ్వు ఆపుకోలేకపోయాడు. అయితే ఈ సీరియస్ ప్రాక్టీస్ మధ్యలో విరాట్ కోహ్లీ చేసిన హంగామా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Virat Kohli : టీమిండియా 2026 ఏడాదిలో తన తొలి సమరానికి సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరగనున్న మొదటి వన్డే కోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వడోదరలోని కొత్త కోటాంబి స్టేడియంలో గత రెండు రోజులుగా కఠినమైన నెట్ సెషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ సీరియస్ ప్రాక్టీస్ మధ్యలో విరాట్ కోహ్లీ చేసిన హంగామా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
సాధారణంగా ప్రాక్టీస్ సెషన్ అంటే వార్మప్ రన్నింగ్‌తో మొదలవుతుంది. ఈ క్రమంలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పరిగెత్తుతున్న తీరును చూసిన కోహ్లీకి అల్లరి బుద్ధి పుట్టింది. అర్ష్‌దీప్ చేతులు ఊపుతూ, కాళ్లు వేసే స్టైల్‌ను కోహ్లీ అచ్చుగుద్దినట్లు అనుకరించాడు. కోహ్లీ అలా అర్ష్‌దీప్ వెనుక వెక్కిరిస్తూ పరిగెత్తడం చూసి మైదానంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే కోహ్లీ అల్లరిని చూసి పగలబడి నవ్వుతూ కనిపించాడు.
Virat Kohli is mimicking Arshdeep Singh’s running style 😂❤️ pic.twitter.com/RbobLlmn5S
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 9, 2026
ఈ సరదా దృశ్యాన్ని అక్కడే ఉన్న కెమెరాలు బంధించడంతో, అది సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్ క్లబ్‌లతో పాటు అర్ష్‌దీప్ ఆడుతున్న ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ సరదా కామెంట్స్ పెట్టాయి. ఎప్పుడూ మైదానంలో చాలా అగ్రెసివ్‌గా కనిపించే విరాట్, ఇలా సరదాగా ఉండటం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
వడోదరలోని కోటాంబి స్టేడియంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో ఇక్కడి ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలి, బహుశా చివరి అవకాశం కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. అందుకే టికెట్ల కోసం భారీ క్యూలు కట్టారు. ప్రాక్టీస్ లో కోహ్లీ, రోహిత్ సిక్సర్లతో హోరెత్తించడంతో..అసలు మ్యాచ్ లో ఇక పరుగుల వరద పారడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.
