విరాట్ కోహ్లీ
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. క్రికెట్ దేవుడు సచిన్ తర్వాత మోస్ట్ క్రేజీ ప్లేయర్‌గా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలచిన టీమిండియా ఆటగాడు. ఇక నీ పని అయిపోయింది.. పొయ్యి రెస్ట్ తీస్కో.. టీమిండియా నుంచి తీసెయ్యండి.. అంటూ విషం కక్కే తన హేటర్స్‌కి ప్రతిసారీ తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. తనపై వచ్చే విమర్శలను సైలెంట్‌గా భరించే కింగ్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో వయెలెంట్ రిప్లయ్ ఇచ్చేస్తాడు. 1988 నవంబరు 5న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన కింగ్ కోహ్లీ.. తన మూడో ఏట నుంచే బ్యాటింగ్‌లో శిక్షణ మొదలుపెట్టాడు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన కోహ్లీ.. ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట తిరగరాసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సాధించాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను 2017లో కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కోహ్లీ..ఆనతి కాలంలోనే టీమిండియా వన్డే జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ దశాబ్ధపు మేటి పురుష క్రికెటర్‌గా కోహ్లీ పేరును ఐసీసీ 2020లో ప్రకటించడం విశేషం. వన్డేలో అత్యధిక సెంచరీలు (50) సాధించిన ఆటగాడికి ప్రపంచ రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో నవంబరు 15న ముంబై వేదికగా జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో కోహ్లీ తన 50వ సెంచరీని పూర్తి చేసి.. సచిన్ (49) రికార్డును అధిగమించాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. అలాగే వరల్డ్ కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ ఘనత సాధించాడు. టీ20, ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల రికార్డులు కోహ్లీ పేరిటే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలుస్తున్నాడు. 2011 క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జట్టులో కోహ్లీ ప్రాతినిధ్యంవహించాడు. 2013లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డే ఫార్మెట్‌లో నెం.1 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ)కి ఐపీఎల్‌లో ప్రాతినిధ్యంవహిస్తున్న కోహ్లీకి.. తన జట్టుకు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడం మాత్రమే కాస్త అసంతృప్తి కలిగించే అంశం.