Virat Kohli: ఆ సబ్జెక్ట్‌లో అంత వీకా.. టెన్త్‌లో కింగ్ కోహ్లీ మార్కుల లిస్ట్ చూశారా..?
Virat Kohli 10th Class Marksheet: ప్రస్తుత రోజుల్లో మార్కులు, ర్యాంకుల చుట్టూనే విద్యార్థుల ప్రపంచం తిరుగుతోందనడంలో సదేహం లేదు. అయితే, కేవలం అకడమిక్ మార్కులు మాత్రమే ఒక వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించలేవని ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిరూపించారు.

Virat Kohli 10th Class Marksheet: విరాట్ కోహ్లీ అంటే నేడు ప్రపంచ క్రికెట్‌లో ఒక బ్రాండ్. రికార్డుల రారాజుగా పేరుగాంచిన కింగ్ కోహ్లీ, తన పాఠశాల రోజుల్లో ఒక సాధారణ విద్యార్థిగానే ఉన్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆయన పదో తరగతి మార్కుల జాబితా చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. విరాట్ కోహ్లీ గణితం, సైన్స్ లో తక్కువ మార్కులు సాధించడం గమనార్హం. కానీ, అదే సమయంలో ఆయనకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని ఈ మార్కులు ఎప్పుడూ ఆపలేకపోయాయి.
జితిన్ యాదవ్ అనే ఐఏఎస్ విరాట్ కోహ్లీ మార్కుల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “నీ మార్కుల షీట్‌లో నీ ప్యాషన్ ఎక్కడా కనిపించదు” అని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక స్టేట్‌మెంట్ మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థులకు ఒక గొప్ప ప్రేరణ. మార్కులు తక్కువ వచ్చాయని నిరాశ చెందే వారికి, జీవితం కేవలం తరగతి గదితో ముగిసిపోదని కోహ్లీ నిరూపించారు.
మ్యాథ్స్, సైన్స్‌లో తడబాటు – గ్రౌండ్‌లో మాత్రం తోపు..
విరాట్ తన పదో తరగతిలో సైన్స్ థియరీలో కేవలం 32 మార్కులు మాత్రమే సాధించాడు. ప్రాక్టీకల్స్ లో కలిపి 55 మార్కులు వచ్చాయి. ఇక గణితంలో అతి తక్కువగా 51 మార్కులు మాత్రమే వచ్చాయి. అయితే, విచిత్రమేమిటంటే నేడు మైదానంలో భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు (Run Chase) కోహ్లీ వేసే లెక్కలు ప్రపంచంలో మరెవరూ వేయలేరు. ఏ బౌలర్‌ను ఎప్పుడు ఎదుర్కోవాలి, ఎన్ని బంతుల్లో ఎన్ని పరుగులు చేయాలి అనే విషయంలో కోహ్లీని మించిన ‘ఛేజింగ్ మాస్టర్’ క్రికెట్‌లో లేరనడంలో అతిశయోక్తి లేదు.
తల్లిదండ్రులకు ఒక పాఠం..
Had marks been the sole factor, the entire nation wouldn’t be rallying behind him now. Passion and Dedication are the key. @imVkohli pic.twitter.com/aAmFxaghGf
— Jitin Yadav, IAS (@Jitin_IAS) August 9, 2023
కోహ్లీ విజయ ప్రస్థానంలో ఆయన తండ్రి ప్రేమ్‌నాథ్ కోహ్లీ పాత్ర మరచిపోలేనిది. కొడుకు చదువులో రాణించకపోయినా, అతనికి ఉన్న క్రికెట్ నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు. ఈ రోజు విరాట్ కోహ్లీ సాధించిన ఖ్యాతిలో ఆ ప్రోత్సాహం ఎంతో ఉంది. కేవలం ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులకు కోహ్లీ సక్సెస్ స్టోరీ ఒక కనువిప్పు.
“పర్ఫెక్షన్ కంటే ప్యాషన్ ముఖ్యం” అనే సూత్రం కోహ్లీ జీవితానికి అతికినట్లు సరిపోతుంది. మార్కులు జీవితంలో ఒక భాగమే కానీ జీవితం కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి కష్టపడితే విరాట్ కోహ్లీలా ప్రపంచాన్ని ఏలవచ్చని ఆయన మార్కుల జాబితా మనకు గుర్తు చేస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
