Telangana News: నిరుద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. త్వరలో మరో కొత్త పథకం.. రూ.50 వేల వరకు ఛాన్స్
Telangana Government: నిరుద్యోగులకు ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రెడీ అయింది. ఈ కొత్త కార్యక్రమం ద్వారా నిరుద్యోగులు రూ.50 వేల వరకు సంపాదించొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు దీని ద్వారా లబ్ది పొందోచ్చు. ఇందుకోసం ఏం చేయాలో చూద్దాం.

మీరు నిరుద్యోగిగా ఉన్నారా..? స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారా..? డెయిరీ రంగంలో రాణించాలనుకుంటున్నారా..? ఎవరిపై ఆధారపడకుండా మీరే బాస్ అవ్వాలని భావిస్తున్నారా..? అయితే ఇలాంటివారికి గుడ్‌న్యూస్. నెలకు రూ.50 వేల వరకు ప్రభుత్వ సహాయంతో సంపాదించుకోవచ్చు. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం ఈ బంపర్ అవకాశం కల్పిస్తోంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం ఏంటి..? ఎలా ఈ స్కీమ్‌లో చేరాలి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
విజయ డెయిరీ పార్లర్లు
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయ డెయిరీ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వ డెయిరీ సంస్థ ద్వారా నిరుద్యోగులు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. డెయిరీ వ్యాపారాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు రాష్ట్ర పాడి పారిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని పట్టణాలు, నగరాల్లో దాదాపు 400కిపైగా డెయిరీ పార్లర్లను ఓపెన్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసోంది. వీటిల్లో నిరుద్యోగులను భాగస్వామ్యం చేయనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే పలు కీలక ప్రాంతాల్లో విజయ డెయిరీ పార్లర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుండగా.. త్వరలో ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, సిద్దిపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, సిద్దపేట జిల్లాల్లో కూడా పార్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వ సాయంతో ఈ పార్లర్లను ఏర్పాటు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే..?
రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మీకు సొంతగా లేదా అద్దె ప్రాతిపదికన స్థలం కలిగి ఉండాలి. ఆ స్థలంలో పార్లర్లకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ఉండాలి. ఆ తర్వాత ముందుగా రూ.25 వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి మీకు పార్లర్ మంజూరు చేస్తారు. విజయ డెయిరీ ఉత్పత్తులను మీకు అందిస్తారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీర్ వంటి విజయ పాల ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మీరు ఆదాయం సంపాదించవచ్చు. నెలకు రూ.30 నుంచి రూ.50 వేల వరకు సంపాదన వస్తుంది. అయితే పార్లర్ కోసం రిఫ్రిజిరేటర్, ఇంటీరియల్, అద్దె ఖర్చు రూ.2 లక్షల వరకు పట్టవచ్చు. విజయ డెయిరీ ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దీంతో పార్లర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆదాయం బాగానే వస్తుందని చెబుతున్నారు.
