Hyderabad: రాఖీ క‌ట్టిన అక్క‌కి త‌మ్ముడి ప్రాణ‌దానం.. ఏఐఎన్‌యూలో కిడ్నీ మార్పిడి.. సోదరి కోసం ఏదైనా చేస్తానంటూ..

Hyderabad: దాదాపు మూడేళ్లు బాగా ఇబ్బంది ప‌డ్డారు. కొన్నాళ్లు పుణెలో, మ‌రికొన్నిసార్లు హైద‌రాబాద్‌లో డ‌యాల‌సిస్ చేయించేవారు. మ‌హారాష్ట్రలోని జీవ‌న్‌దాన్‌లో రిజిస్ట‌ర్ చేయించినా, అక్క‌డ సీరియ‌ల్ నంబ‌ర్ 20 ఇప్ప‌టికీ అలాగే ఉంది త‌ప్ప‌, ఏమీ క‌ద‌ల్లేదు. హైద‌రాబాద్‌లో రిజిస్ట‌ర్ చేయిద్దామ‌నుకుంటే, అడ్ర‌స్ ప్రూఫ్ మ‌హారాష్ట్రది ఉండ‌టంతో కుద‌ర‌లేదు. దాంతో ఏఐఎన్‌యూ వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా, కుటుంబంలోనే ఎవ‌రైనా దానం చేస్తే కుదురుతుంద‌ని చెప్పారు. దాంతో శీత‌ల్ త‌మ్ముడు దుష్యంత్..

Hyderabad: రాఖీ క‌ట్టిన అక్క‌కి త‌మ్ముడి ప్రాణ‌దానం.. ఏఐఎన్‌యూలో కిడ్నీ మార్పిడి.. సోదరి కోసం ఏదైనా చేస్తానంటూ..
Dushyant And Sheetal Bhandari
Follow us
S Navya Chaitanya

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 29, 2023 | 4:44 PM

హైదరాబాద్, ఆగస్టు 29: శీత‌ల్ భండారీ(43) హైద‌రాబాద్ ఆడ‌ప‌డుచు. పెళ్ల‌యిన త‌ర్వాత పుణె త‌ర‌లి వెళ్లారు. అక్క‌డ ఆమె ఒక బొటిక్ నిర్వ‌హించేవారు. 2017లో కాళ్లు, ముఖం వాపు రావ‌డంతో వైద్యుల వ‌ద్ద‌కు వెళ్ల‌గా, ప‌రీక్ష‌లు చేసి కిడ్నీ స‌మ‌స్య ఉంద‌ని చెప్పారు. దాదాపు ఏడాది వ‌ర‌కు మందుల‌తోనే చికిత్స చేశారు. శీత‌ల్ చెల్లెలు పూన‌మ్ హైద‌రాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో ఉంటారు. వాళ్ల అత్త‌గారికి కిడ్నీ స‌మ‌స్య ఉన్న‌ప్పుడు న‌గ‌రంలోని ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రిలో చూపించారు. ఆమెకు పూర్తిగా న‌యం కావ‌డంతో శీత‌ల్‌ను కూడా అక్క‌డే చూపిద్దామ‌ని ఆమె సూచించారు. ఇక్క‌డ చూపించిన త‌ర్వాత 2020 నుంచి డ‌యాల‌సిస్ మొద‌లైంది. కానీ బీపీ బాగా హెచ్చుత‌గ్గులు ఉండ‌టం, మ‌ధ్య‌లో ఫిట్స్ రావడం లాంటి స‌మ‌స్య‌లు క‌నిపించాయి.

అలాగే దాదాపు మూడేళ్లు బాగా ఇబ్బంది ప‌డ్డారు. కొన్నాళ్లు పుణెలో, మ‌రికొన్నిసార్లు హైద‌రాబాద్‌లో డ‌యాల‌సిస్ చేయించేవారు. మ‌హారాష్ట్రలోని జీవ‌న్‌దాన్‌లో రిజిస్ట‌ర్ చేయించినా, అక్క‌డ సీరియ‌ల్ నంబ‌ర్ 20 ఇప్ప‌టికీ అలాగే ఉంది త‌ప్ప‌, ఏమీ క‌ద‌ల్లేదు. హైద‌రాబాద్‌లో రిజిస్ట‌ర్ చేయిద్దాం అనుకుంటే, అడ్ర‌స్ ప్రూఫ్ మ‌హారాష్ట్రది ఉండ‌టంతో కుద‌ర‌ లేదు. దాంతో ఏఐఎన్‌యూ వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా, కుటుంబంలోనే ఎవ‌రైనా దానం చేస్తే కుదురుతుంద‌ని సలహా ఇచ్చారు. దాంతో శీత‌ల్ త‌మ్ముడు దుష్యంత్ (37)  తన అక్కకు తానే కిడ్నీ ఇస్తాన‌ని ముందుకొచ్చారు. చిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌తి ఏటా పెద్ద‌క్క శీత‌ల్‌, చిన్న‌క్క పూన‌మ్ ఇద్ద‌రూ ఎక్క‌డున్నా దుష్యంత్ వద్దకు వ‌చ్చి రాఖీ క‌ట్టేవారు. త‌న క్షేమం గురించి అంత‌లా ఆలోచించే అక్క‌కు ఇబ్బంది అంటే తాను క‌చ్చితంగా కిడ్నీ ఇస్తాన‌ని చెప్పారు.

అయితే, అలా ఇస్తే త‌ర్వాత త‌మ్ముడి జీవితానికి ఇబ్బంది అవుతుంద‌ని దుష్యంత పెద్ద అక్క శీత‌ల్ ఆందోళ‌న చెందారు. అయినా దుష్యంత్ మాత్రం ప‌ట్టు వీడ‌లేదు. చివ‌ర‌కు ప‌రీక్ష‌లు అన్నీ కూడా స‌రిపోవ‌డంతో ఏఐఎన్‌యూలో సీనియ‌ర్ నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ ఎంవీ రావు, డాక్ట‌ర్ సుజిత్ రెడ్డి సహా ఇతర వైద్యుల‌ బృందం, యూరాల‌జిస్టు డాక్ట‌ర్ మ‌ల్లికార్జున బృందం అక్కాతమ్ముళ్లు ఇద్ద‌రికీ శ‌స్త్రచికిత్స చేసి, కిడ్నీ మార్చారు. ప్ర‌స్తుతం అక్కాత‌మ్ముళ్లిద్ద‌రూ విడిగా ఐసొలేష‌న్‌లో ఉంటున్నారు. త‌మ్ముడు త‌న కంటే చిన్న‌వాడు కావ‌డంతో కిడ్నీ ఇస్తానంటే చాలా బాధ‌ప‌డ్డాన‌ని, అయినా త‌న ప‌ట్టుద‌ల వీడక‌పోవ‌డంతో స‌రేన‌న్నాన‌ని శీతల్ తెలిపారు. ఏఐఎన్‌యూ వైద్యులు చాలా స‌హ‌క‌రిస్తున్నార‌ని, ఎప్పుడు ఏ అనుమానం వ‌చ్చి మెసేజ్ పెట్టినా వెంట‌నే స్పందిస్తున్నార‌ని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నీ తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..