Hyderabad: పిల్లల పాలిట మృత్యువుగా మారుతున్న పతంగులు.. 24 గంటల్లో 2 ప్రమాదాలు!
చిన్నారులు, జనాలు సరదా కోసం ఎగురవేసే గాలి పటాలు ప్రస్తుతం ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ఇన్నాళ్లు కేవలం గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించే చైనా మాంజా కారణంగానే జనాలు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు ఓ బాలుడు ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి.

సరదాగా గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై పడి 10 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బల్డింగ్‌పై పతంగి ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు టెరస్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ బాలుడు. సాయిబాబా నగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్ అనే 10 ఏళ్ల బాలుడు సోమవారం ఉదయం సరదాగా ఇంటి బిల్డింగ్‌పైకి ఎక్కి గాలిపటం ఎగురవేస్తున్నాడు.. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి టెరస్ పై నుంచి పడిపోయాడు.
బిల్డింగ్‌పై నుంచి పడిపోవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకు కళ్లముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హేమంత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కూకట్‌పల్లిలో అచ్చం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ బాలుడు సరదాగా గాలిపటం ఎగురవేస్తుండగా.. అది వెళ్లి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయింది. అయితే ట్రాన్స్‌ఫార్మర్‌పై చిక్కుకున్న గాలిపటాన్ని తీసుకునేందుకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను ముట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురై పై నుంచి పడిపోయాడు. గమనించిన స్థానికులు బాలుడిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు అతనికి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
