Telangana: ఇదేం మాయ బాబోయ్.. బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు.. పింఛన్ పాయే..
ఒక వ్యక్తి బ్రతికుంగానే చనిపోయినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఇతడికి రావాల్సిన పింఛన్ ఆగిపోయింది. ఎందుకు నిలిపివేశారంటూ అధికారులను ప్రశ్నించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయన బతికి ఉన్నాడు.. రికార్డులో మాత్రం చనిపోయినట్లు నమోదు చేశారు. దీంతో తనకు పెన్షన్ ఎందుకు ఆగిపోయిందని ఆందోళన చెందాడు. పెన్షన్ రాలేదని అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఈ వ్యక్తి చనిపోయాడని.. అధికారులు చెప్పడంతో కంగుతిన్నాడు.. ఈ చనిపోయిన వ్యక్తిని నేనే అంటూ అధికారులకు చెప్పాడు. దీంతో అధికారులు బిత్తిరి చూపులు చూశారు..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామపంచాయతీలో శ్రీనివాస్ అనే వ్యక్తి దివ్యాంగుడు. పుట్టుకతోనే అతడు దివ్యాంగుడు. దీంతో చాలా ఏళ్ల నుంచి ఇతనికి దివ్యాంగ పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ ఆధారంగానే కాలం వెల్లదీస్తున్నాడు. అయితే సంవత్సరం నుంచి.. పెన్షన్ రావడం లేదు. చాలాసార్లు స్థానికంగా ఉన్న అధికారుల దగ్గరికి వెళ్లి కలిశాడు. అక్కడి అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో మండల అధికారులను కలిస్తే ఈ వ్యక్తి చనిపోయాడు అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో దివ్యాంగుడు తీవ్ర షాక్ కు గురయ్యారు.. తానే శ్రీనివాస్ అని సమాధానం ఇచ్చాడు. బతికున్న వ్యక్తిని అధికారులు మరణించినట్లు నమోదు చేసి సామాజిక భద్రత పింఛన్ నిలిపివేయడంపైన విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పింఛను వెంటనే పునరుద్ధరించాలని బాధితుడు కోరాడు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు పించన్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
