AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పోస్టు ఖాళీగా ఉందన్న వీవీఎస్ లక్ష్మణ్! ఇలా అయితే ఎలా అంటూ కైఫ్ అసంతృప్తి

టీమిండియాలో పెరుగుతున్న గాయాలపై మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ బీసీసీఐని ప్రశ్నించారు. సాయి సుదర్శన్‌, జస్ప్రీత్‌ బుమ్రా వంటి ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పనితీరుపై చర్చ మొదలైంది. స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌ హెడ్‌ నియామకం ఆలస్యం కావడంపై కైఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ పోస్టు ఖాళీగా ఉందన్న వీవీఎస్ లక్ష్మణ్! ఇలా అయితే ఎలా అంటూ కైఫ్ అసంతృప్తి
Vvs Laxman And Mohammad Kaif
SN Pasha
|

Updated on: Aug 12, 2026 | 12:32 PM

Share

టీమిండియాను వేధిస్తున్న గాయాలు ఇప్పుడు భారత క్రికెట్‌లో పెద్ద చర్చగా మారాయి. సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవుతుండటంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా, క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా CoE వ్యవహారంపై స్పందించారు.

స్పోర్ట్స్ సైన్స్ హెడ్ పోస్టు ఖాళీ

వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మాజీ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్ వైదొలిగిన తర్వాత ఆ కీలక పోస్టు ఖాళీగానే ఉంది. కొత్త వ్యక్తిని నియమించేందుకు పలువురు అభ్యర్థులను సంప్రదించినప్పటికీ, చివరి దశలో కొందరు తప్పుకోవడంతో నియామక ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. ఆండ్రూ లీపస్‌తో బీసీసీఐ పలుమార్లు చర్చలు జరిపిందని, అన్ని అంశాలు దాదాపు ఖరారైన తర్వాత కుటుంబ కారణాలను చూపుతూ ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నారని లక్ష్మణ్ చెప్పారు. అనంతరం ఐదుగురు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసినప్పటికీ, తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియన్ అభ్యర్థి బెంగళూరుకు మారలేనని చెప్పి తప్పుకున్నట్లు వివరించారు.

బీసీసీఐపై మహమ్మద్ కైఫ్ అసంతృప్తి

ఈ పరిణామాలపై మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించారు. గాయాల సమస్యను బీసీసీఐ తేలికగా తీసుకోకూడదని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫిజియోథెరపిస్టులు, వైద్య నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం బీసీసీఐకి ఉందని, అలాంటి నిపుణులను ఆకర్షించడంలో ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో తనకు ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. సమస్యను నిపుణులు సమగ్రంగా పరిశీలించి, ప్రారంభ దశలోనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కైఫ్ పేర్కొన్నారు. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైతే దాని ప్రభావం మ్యాచ్ ఫలితాలపై కూడా పడుతుందని ఆయన అన్నారు.

బుమ్రా గాయంపై ఆందోళన

జస్ప్రీత్ బుమ్రా ఉదాహరణను కైఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేకు బుమ్రా దూరమయ్యారని, ఆ మ్యాచ్‌లో భారత్ 387 పరుగులు ఇచ్చిందని గుర్తుచేశారు. సిరీస్ 1-1తో సమంగా ఉన్న సమయంలో జరిగిన కీలక మ్యాచ్‌లో బుమ్రా లేకపోవడం భారత జట్టుపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న గాయాల జాబితాను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ, CoEకి సంబంధించిన నిపుణులు, వైద్య బృందాలు కలిసి పనిచేసి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కైఫ్ కోరారు. టీమిండియా కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కాపాడటానికి గాయాల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో కొనసాగుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us