AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై కీలక అప్డేట్.. దసరా నాటికి లైన్ క్లియర్.. ప్రభుత్వం డెసిషన్..

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకోవడంపై స్పీడ్ పెంచింది. దసరా నాటికి స్వాధీనం ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఎల్ అండ్ టి సంస్థకు రూ.13,600 కోట్ల రుణాలను తిరిగి చెల్లించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే సంస్థల కోసం చూస్తోంది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై కీలక అప్డేట్.. దసరా నాటికి లైన్ క్లియర్.. ప్రభుత్వం డెసిషన్..
Hyderabad Metro
Venkatrao Lella
|

Updated on: Sep 27, 2026 | 8:26 PM

Share

హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. దసరా నాటికి మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మెట్రో బాధ్యతలను ఎస్బీఐ క్యాప్స్‌కు ఇదివరకే అప్పగించగా.. ఈ సంస్థ గుజరాత్ గిఫ్ట్ సిటీ, ముంబైలోని బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. బ్యాంకులు అడుగుతున్న అధిక వడ్డీ రేట్లే ప్రధాన సమస్యగా మారాయి. మెట్రో మొదటి దశను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే.. ఎల్ అండ్ టి సంస్థ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13,600 కోట్ల రుణాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రుణాలపై సగటున 7 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ రేటు పడుతోంది. ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండాలంటే.. అంతకంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే సంస్థలను గుర్తించడం క్లిష్టతరమైన పనిగా మారింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) గతంలో 4 శాతం లోపే వడ్డీ రేటుకు రుణం ఇచ్చేందుకు సిద్ధపడింది. జపాన్ కరెన్సీ యెన్ రూపంలో కొంత మొత్తం, రూపాయల్లో మరికొంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ చివరి నిమిషంలో ఈ రుణం ఆగిపోయింది.

మెట్రో అధికారులు గతంలో కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం రుణాలను విడుదల చేయాలని ఐఆర్ఎఫ్‌సీకి ఎప్పటికప్పుడు వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఐఆర్ఎఫ్‌సీ రుణం నిలిచిపోవడంతో..  తక్కువ వడ్డీ రేటుకు అప్పులు ఇచ్చే బ్యాంకుల కోసం ఎస్బీఐ క్యాప్స్ నిరంతరం ప్రయత్నిస్తోంది. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ వడ్డీ రేటును 7 శాతానికి పైగానే ఆఫర్ చేస్తోంది.  ఏ  సంస్థ నుంచి తక్కువ వడ్డీకి రుణం లభించకపోతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నుంచి నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఆప్షన్ పెట్టుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ కోసం కూడా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

హైదరాబాద్ మెట్రో ఫేజ్ వన్‌లో ఎల్ అండ్ టి సంస్థ వాటాను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన షేర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదిరింది. రూ.1461.47 కోట్లతో ఈక్విటీ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వంపైనే పడుతోంది. జూన్ 30వ తేదీ నాటికి రుణ సమీకరణ ప్రక్రియ పూర్తవుతుందని ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్.. సెబీకి సమాచారం ఇచ్చింది.  అయితే రుణ ప్రక్రియలో జాప్యం వల్ల సెప్టెంబర్ 30 కల్లా పూర్తవుతుందని మరోసారి సెబీకి తెలియజేశారు.

Follow Us