Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. రెండ్రోజులే టైమ్.. అంతా ఉచితంగానే.. రెడీగా ఉండండి..
తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్ వచ్చింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్దమైంది. కేవలం రెండ్రోజులు మాత్రమే సమయం ఉంది. లబ్దిదారులందరికీ వీటిని అందించనున్నారు. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు ముహూర్తం ఖరారు అయింది. దీంతో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతీఒక్కరికీ ఉచితంగా ఈ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ మేరకు పౌరసరఫరాశాఖ ఇప్పటికే సన్నాహాలు చేసింది. కొత్త కార్డులను అన్ని మండల కేంద్రాలకు పంపించింది. దాదాపు 1.06 కోట్లకుపైగా కుటుంబాలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి అధికారులు వెళ్లి అందించనున్నారు. వీటి ద్వారా 3.43 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కాగితపు రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి స్థానంలో ఏటీఎం తరహాలో ఉండే కార్డులను అందిస్తున్నారు.
ఈ నెల 15వ తేదీ నుంచి స్టార్ట్..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం చేపట్టనుంది. ఆ రోజున సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక అదే రోజు జిల్లా, మండల కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎలాంటి అవాంతరాలు రాకుండా పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన కుటుంబాలకు మాత్రమే ఈ కార్డులు అందుతాయి. కేవైసీ పూర్తి చేయనివారికి ఈ కార్డు అందదు. కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత ఆలస్యంగా అందుతుంది. ఈ నెల 14వ తేదీ వరకు కేవైసీ పూర్తి చేసేందుకు లబ్దిదారులకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆలోపు పూర్తి చేస్తేనే స్మార్ట్ కార్డు పొందగలరు. రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతీ వ్యక్తి కేవైసీ పూర్తి చేయడానికి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రేషన్ దుకాణానికి వెళ్లి లేదా మీ సేవ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
స్మార్ట్ కార్డు ఎలా ఉంటుందంటే..?
మహిళల పేరు మీదనే స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. మహిళలను కుటుంబ పెద్దగా గుర్తించనున్నారు. కార్డుపై మహిళ ఫొటో మాత్రమే ముద్రించి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కార్డులోని వివరాలు, ఫొటోలు ఆటోమేటిక్‌గా కొత్త రేషన్ కార్డులకి బదిలీ అవుతాయి. ఈ కార్డులో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు.. ఏయే నెలల్లో ఎంత రేషన్ తీసుకున్నారు అనే వివరాలు డీలర్లు తెలుసుకోవచ్చు. ఇక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా రేషన్ సరుకులను సులువుగా పొందవచ్చు.
