ఎవర్రా బాబు నువ్వు.. ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన ఓ వ్యక్తిని చెక్ చేయగా అతని బ్యాగులో కోతి పుర్రె కనిపించడం కలకలం రేపింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఘటనపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్లైట్ ఎక్కే ముందు నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ఓ వ్యక్తి బ్యాగులో కొతి పుర్రె లభించిన ఘటన ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఓ ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చాడు. అయితే విమానం ఎక్కే ముందు బ్యాగులను తనిఖీ చేస్తుండగా.. అతడి బ్యాగులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో అతన్ని పక్కకు తీసుకొని బ్యాగును పూర్తిగా తనిఖీ చేయగా అందులో ఓ పుర్రె బయటపడింది.
అది చూసి షాకైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అది కోతి పుర్రె అని అతడు చెప్పినట్లు సమాచారం. అయితే వన్యప్రాణులకు సంబంధించిన వస్తువులను అనుమతులు లేకుండా తరలించడం చట్టవిరుద్ధం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లి.. ప్రయాణికుడిని, స్వాధీనం చేసుకున్న పుర్రెను తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగించారు.
దీంతో ఘటన వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు ఎంత అప్రమత్తంగా జరుగుతున్నాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రతతో పాటు వన్యప్రాణులకు సంబంధించిన అక్రమ రవాణాను అడ్డుకోవడంలోనూ భద్రతా సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కొసం ఇక్కడ క్లిక్ చేయండి.
