ప్రభుత్వంతో ఫలించని చర్చలు.. తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల నిరసన జ్వాలలు రెండో రోజుకు చేరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన స్టైఫండ్ పెంపుపై జూడాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా, కేవలం 3 శాతం మాత్రమే స్టైఫండ్ పెంచుతామనడంపై జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.

ఏపీలో జూనియర్ డాక్టర్ నిరసన రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రభుత్వ నిబంధనలు, జీవో ప్రకారం తమ స్టైఫండ్‌ను 30 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో కనీసం 15 శాతమైనా పెంచాలని జాడాలు విజ్ఞప్తి చేసినప్పటికీ.. అటు ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. దీంతో తమ ఆందోళనను మరింత ఉదృతం చేస్తామంటున్నారు జూనియర్ డాక్టర్లు.
ఫలించని చర్చలు.. తీవ్రమైన నిరసనలు
ఇదిలా ఉండగా మంఘళవారం హెల్త్ సెక్రటరీతో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బుధవారం విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేశారు జూనియర్ డాక్టర్. ఈ సమస్య వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,000 మంది జూనియర్ డాక్టర్లు, హౌస్‌సర్జన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తెలంగాణ తరహాలోనే ఇవ్వాలి..
పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న రీతిలోనే తమకు కూడా గౌరవప్రదమైన స్టైఫండ్ అందించాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమానమైన సేవలు అందిస్తున్నప్పుడు ఏపీలో తక్కువ స్టైఫండ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూనియర్ డాక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకి ఎలాంటి అంతరాయం కలగకుండా.. రోగులకు ఇబ్బంది లేకుండా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే ‘సమ్మె’ ఉధృతం..! ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే జోక్యం చేసుకుని స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన, సానుకూల ప్రకటన చేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో నిరసనలు,సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
