Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sathupalli Road Accident: అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్‌..? తల్లడిల్లిన కన్నపేగు

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకు.. నిండా ఐదేళ్లు కూడా నిండని పసి మొగ్గ.. ఆ తల్లి కళ్ల ముందే లారీ చక్కాల కింద చిద్రమైపోయాడు. అక్కడికక్కడే బిడ్డ ప్రాణాలు వదలడం చూసిన ఆ తల్లి.. ఇంత ఘోరం చూశాక తన ప్రాణం ఎందుకు పోలేదా? అని గుండెలవిసేలా రోదించింది..

Sathupalli Road Accident: అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్‌..? తల్లడిల్లిన కన్నపేగు
Sathupalli Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 02, 2024 | 12:28 PM

సత్తుపల్లి, డిసెంబర్‌ 2: దైవ దర్శనానికి వెళ్తుండగా లారీ రూపంలో ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది కరుణలేని విధి. వచ్చీరాని మాటలతో తప్పటడుగులు వేస్తూ తమ కళ్లముందు తిరుగుతూ సందడి చేసిన తన గారాల పట్టి.. చూస్తుండగానే అశువులు బాయడం చూసిన ఆ తల్లి గుండె విలవిలలాడింది. రోడ్డుపైనే బిడ్డను ఒళ్లో పెట్టుకుని గుండెలు బాదుకుంటూ రోధించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం జగన్నాథపురానికి చెందిన ఊకే రాజు, ఏపీలోని నర్సీపట్నానికి చెందిన గుడివాడ ప్రసాద్‌లు కిష్టారంలోని సింగరేణి ఓసీ ఓబీ క్యాంపులో మిషన్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ తమతమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో నర్సీపట్నంలోని తన భార్య రాజ్యలక్ష్మి, కుమార్తెలు నిహిత, విఘ్నేశ్వరిలను తీసుకుని రెండు రోజుల క్రితం సత్తుపల్లికి వెళ్లాడు. అక్కడి నుంచి స్నేహితుడు రాజు కుటుంబంతో, ప్రసాద్ కుటుంబం కూడా ఆదివారం తిరుమలకు బయల్దేరారు.

వారు ఆదివారం తొలుత విజయవాడకు, అక్కడి నుంచి తిరుపతికి వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఉదయం 7 గంటల సమయంలో రాజు, తన భార్య స్వరూపారాణి, కుమారులు యశ్వంత్‌ (5), దీక్షిత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై జగన్నాథపురం నుంచి కిష్టారంలోని ఓబీ క్యాంపు వద్దకు చేరుకున్నారు. అప్పటికే ప్రసాద్‌ కుటుంబం అక్కడకు చేరుకుని, రాజు కుటుంబం కోసం వేచి చూస్తున్నారు. రాజు కుటుంబం బస్టాండుకు వెళ్లే క్రమంలో జాతీయ రహదారి పక్కన నిలుచుని ఉండగా లారీ రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. వారి వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ వేగంగా వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు కుమారుడు యశ్వంత్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రసాద్‌ నాలుగేళ్ల కుమార్తె నిహితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితోపాటు అక్కడికి వచ్చిన ప్రదీప్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను హుటాహుటీన సత్తుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. వీరిలో నిహిత పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. కుమారుడు యశ్వంత్‌ కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు. వారి రోదనలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.