Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Namo Drone Didi: డ్రోన్‌ పైలట్లుగా గ్రామీణ మహిళలు.. 80 శాతం సబ్సిడీతో కేంద్రం చేయూత

గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ దీదీలు వస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో డ్వాక్రా మహిళలకు వీటిని అందించి, 15 రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చి స్వయం ఉపాధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 15 వేల మంది మహిళలను ఎంపిక చేశారు. ఈ ఏడాది వెయ్యి మందికి డ్రోన్లు పంపిణీ చేశారు..

Namo Drone Didi: డ్రోన్‌ పైలట్లుగా గ్రామీణ మహిళలు.. 80 శాతం సబ్సిడీతో కేంద్రం చేయూత
Namo Drone Didi
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2024 | 10:53 AM

భారత ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకం.. గ్రామీణ జీవనోపాధి అభివృద్ధికి, సంపూర్ణ సామాజిక అభివృద్ధికి గేమ్ ఛేంజర్ లాంటిది. ఇది మహిళలకు సాధికారత కల్పిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది. అక్షరాలా అభివృద్ధిని కొత్త ఎత్తులకు తీసుకువెళుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ పథకాన్ని సాంకేతికత, వ్యూహాత్మకంగా ఉపయోగించడం ద్వారా ఇవన్నీ సాధించవచ్చు. సాంప్రదాయ పితృస్వామ్య జీవనోపాధితో కూడిన గ్రామీణ నేపధ్యం కలిగిన మహిళలు ఇప్పుడు డ్రోన్‌ పైలెట్లుగా మారుతున్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) ఈ పథకం ద్వారా డ్రోన్‌లు, శిక్షణ, వాటిని ఆపరేట్ చేయడానికి అవసరమైన లైసెన్స్‌లను అందిస్తుంది. ఇది వారిని నైపుణ్యం కలిగిన డ్రోన్ వ్యవస్థాపకులుగా మారుస్తుంది.

రెండేళ్లలో 15000 మహిళలరే డ్రోన్లు..

2024-25 నుంచి 2025-26 వరకు దాదాపు 15 వేల డ్వాక్రా మహిళలకు డ్రోన్‌లను అందించడం, వ్యవసాయ అవసరాల కోసం రైతులకు అద్దె సేవలను అందించడం ఈ పథకం లక్ష్యం. మహిళా స్వయం సహాయక సంఘాలు డ్రోన్ ధరలో 80 శాతం సబ్సిడీ(అంటే రూ. 8 లక్షల వరకు) పొందొచ్చు. అంటే ఈ డబ్బు చెల్లింయవల్సిన అవసరం లేదు. మిగిలిన 20 శాతం నేషనల్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (AIF) వంటి సంస్థల నుంచి అతి తక్కువ 3 శాతం వడ్డీతో రుణాల ద్వారా పొందొచ్చు.

ఈ మహిళా డ్రోన్‌ పైలట్లను ‘డ్రోన్ దీదీలు’ అని అంటారు. వీరు పురుగుమందులు, ఎరువులు చల్లడం, పంటల పర్యవేక్షణ, రైతులకు ఏరియల్ సర్వేలు వంటి కీలకమైన సేవలను అందిస్తారు. వ్యవసాయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల వ్యవసాయంలో ఉత్పత్తి పెంచడం, ఖర్చులను తగ్గించడం, అంతిమంగా పంట దిగుబడిని పెంచడం జరుగుతుంది. తద్వారా మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారుతారు. పీక్ సీజన్‌లలో రోజుకు రూ. 5 వేల వరకు సంపాదించవచ్చు. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళ వార్షిక ఆదాయం రూ. 1 లక్ష వరకు పెరుగడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించారు.

ఇవి కూడా చదవండి

నమో డ్రోన్ దీదీస్ కోసం తెరచుకోనున్న ఉపాధి మార్గాలు

ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 10 ప్రదేశాల్లో 1000 డ్రోన్‌లను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ విస్తరించబోతోదని, వచ్చే 10 ఏళ్లలో ‘నమో డ్రోన్ దీదీస్’ కోసం ఎన్నో మార్గాలు తెరుచుకోనున్నాయని అప్పట్లో మోదీ అన్నారు. ఇక వ్యవసాయంలోనే కాకుండా పాలు, కిరాణా సామాగ్రి వంటి చిన్న వస్తువులను డెలివరీ చేయడానికి కూడా డ్రోన్‌లు పని చేస్తాయి. డ్రోన్ల ద్వారా మందులు, మెడికల్ ఎమర్జెన్సీలో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ పేర్కొన్నారు.

15 రోజుల శిక్షణ

నమో డ్రోన్ దీదీ స్కీమ్‌లోని మరో విశేషం ఏమంటే.. రిమోట్, యాక్సెస్ చేయలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్‌ డెలివరీని చేసే సామర్థ్యం ఉంటుంది. పర్వత ప్రాంతాలు, మైదానాలు, మారుమూల గ్రామాలకు కూడా డ్రోన్‌ సర్వీసులు అందిస్తాయి. IIT ఖరగ్‌పూర్ 2023 అధ్యయనం ప్రకారం నీటిపారుదల సదుపాయం ఉన్న భూములలో ప్రతి హెక్టారు ప్రాతిపదికన పంట ఇన్‌పుట్‌ల సామర్థ్యాన్ని 40 శాతం వరకు డ్రోన్‌ల వినియోగం ద్వారా పెంచవచ్చని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ఏ కొంతమంది మహిళలకు డ్రోన్‌లను అందజేయడం మాత్రమే కాదు.. ఇంటర్నెట్ కనెక్టివిటీకి కూడా ఇవి ఉపయోగపడతాయి. మహిళలకు పైలట్‌లుగా శిక్షణ ఇవ్వడం మొత్తం పథకంలో ఒక భాగం మాత్రమే. నిర్వహణ,అప్లికేషన్లలో వారికి శిక్షణ ఇవ్వడానికి 15-రోజుల సమగ్ర శిక్షణ ఇస్తారు. ఇందులో 5 రోజులు డ్రోన్ పైలట్ శిక్షణ, మిగిలిన 10 రోజులు డ్రోన్ సాంకేతికత, వ్యవసాయ అనువర్తనాలపై శిక్షణ అందిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.