Konda Surekha: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్, బీజేపీ ఫైర్.. హరీష్ రావు ఏమన్నారంటే..
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ ఎపిసోడ్‌లో బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఈ అంశంలో బీఆర్ఎస్ ప్రమేయం లేకపోతే పోస్ట్‌లు పెట్టినవారిని పోలీసులకు అప్పగించాలని బీజేపీ.. కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ ఎపిసోడ్‌లో కాంగ్రెస్, బీజేపీ.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఈ అంశంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో నూలు దండా వేయడాన్ని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇదంతా బీఆర్ఎస్ పనే అంటూ కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొండా సురేఖపై ట్రోలింగ్స్‌కు చింతిస్తున్నానని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో జరిగే వికృతచేష్టలను ఖండిస్తున్నానన్నారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానన్నారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఈ ఎపిసోడ్‌లో బీఆర్ఎస్‌పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు. ప్రభుత్వ కార్యక్రమంపై ఇలాంటి ప్రచారం సరికాదన్నారు. ఇందులో బీఆర్ఎస్ ప్రమేయం లేకపోతే పోస్ట్‌లు పెట్టినవారిని పోలీసులకు అప్పగించాలన్నారు. లేకపోతే అందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. 24 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కొండా సురేఖపై బీఆర్ఎస్ ట్రోలింగ్‌కు నిరసనగా సోమవారం తెలంగాణ భవన్ ముందు నిరసనకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇవాళ ముషీరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గోబ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..