కప్పతల్లికి నీళ్లు పోస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా? తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న అరుదైన ఆచారం!
Kappathalli Ritual: రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్కూరు గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ చిన్నారులు సంప్రదాయ కప్పతల్లి ఆట నిర్వహించారు. కప్పకు నీళ్లు పోస్తూ జానపద గీతాలు ఆలపించిన పిల్లలు గ్రామస్థులను ఆకట్టుకోగా, వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునే ఈ పురాతన ఆచారం మరోసారి గ్రామీణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పింది.

ఆధునిక యుగంలో ఎన్నో సాంకేతిక మార్పులు వచ్చినా, పల్లెల్లో తరతరాలుగా వస్తున్న జానపద సంప్రదాయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామం మరోసారి చాటిచెప్పింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతుల పంటలు పండాలని కోరుకుంటూ గ్రామంలోని చిన్నారులు సంప్రదాయ కప్పతల్లి ఆట నిర్వహించి గ్రామస్థులను ఆకట్టుకున్నారు.
తొలకరి వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గ్రామంలోని చిన్నారులు ఒక రోకలి కర్రకు వేపకొమ్మలు చుట్టి, దానికి కప్పను కట్టి గ్రామ వీధులన్నీ తిరుగుతూ ప్రత్యేక జానపద గీతాలు పాడారు. చిన్నారుల ఆటలో పాల్గొని సంప్రదాయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఇంటి ముందు కప్పతల్లిని తీసుకెళ్లగా, మహిళలు బిందెలతో నీళ్లు పోసి వరుణదేవుడిని ప్రార్థించారు.
వాన దేవుడో.. వాన దేవుడో.. కప్పతల్లికి నీళ్లు పోస్తే కరుణించి వర్షాలు కురిపించు అంటూ చిన్నారులు ఆలపించిన జానపద గీతాలు గ్రామమంతా మార్మోగాయి. ఈ సందర్భంగా ఇంటి యజమానులు పిల్లలకు బియ్యం, ధాన్యం, నగదు రూపంలో కానుకలు అందించారు. అనంతరం సేకరించిన వాటితో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు కప్పతల్లి ఆట ఆడటం అనాదిగా వస్తున్న ఆచారమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కప్పను నీటితో తడిపితే వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే విశ్వాసంతో ఈ సంప్రదాయం కొనసాగుతోందన్నారు.
ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో విస్తృతంగా కనిపించిన ఈ జానపద ఆచారం ప్రస్తుతం చాలా చోట్ల కనుమరుగవుతున్నప్పటికీ, కందికట్కూరు గ్రామంలో మాత్రం చిన్నారులు, పెద్దలు కలిసి నిర్వహించడం విశేషం. పర్యావరణం, వ్యవసాయం, ప్రకృతితో మనిషి అనుబంధాన్ని గుర్తు చేసే ఈ సంప్రదాయం గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. రైతులు కూడా ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.




