నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది?
జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తొలకరి జల్లులలో పులకరింపజేసే ఈ కాలంలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించినా వానల ఊసేలేదు. ఇదంతా సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు..

హైదరాబాద్, జూన్ 17: వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి కురవగానే రైతులు విత్తులు జల్లి పంటకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ప్రస్తుతం వానలు లేకపోవడంతో జల్లిన విత్తనాలు నెలలోనే మురికిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇక ఇప్పటికే ఆలస్యంగా అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు ఉన్నట్టుండి కనుమరుగయ్యాయా? అనే సందేహం అందరికీ కలుగుతుంది. దేశమంతటా రుతు పవనాలు విస్తరించినప్పటికీ, వానలు లేకపోవడానికి కారణమేంటనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన తాజా ఉపగ్రహ చిత్రాలు సమాధానం ఇచ్చాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇప్పటికే విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఉపగ్రహ చిత్రాల్లో మాత్రం వాటి జాడ కానరాలేదని ఐఎండీ పేర్కొంది. ఈ కారణంగానే జూన్ 4వ తేదీ నుంచి సోమవారం వరకూ దేశవ్యాప్తంగా సగటున 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. లోటువర్షపాతం ఏకంగా 64 శాతంగా రికార్డయ్యినట్టు వివరించింది.
నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ సమృద్ధిగా వానలు లేకపోవడానికి తూర్పు-పశ్చిమ పవనాలు ఢీకొనడమే కారణమని ఐఎండీ తెలిపింది. తూర్పు నుంచి వచ్చే పవనాలు (ఈస్టర్లీ జెట్) మేఘాలను తాకడం వల్ల నైరుతి సమయంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల ఎత్తులో ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఉన్నట్టుండి పశ్చిమం దిశ నుంచి అత్యంత వేగంగా వచ్చిన పవనాలు (వెస్టర్లీ జెట్ స్ట్రీమ్) ఈస్టర్లీ జెట్‌ను ఢీకొట్టడంతో మేఘాలు ఏర్పడటం ఆగిపోయినట్లు, అందుకే వానలు పడట్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైరుతి ప్రవేశించి పది రోజులు గడుస్తున్నప్పటికీ దేశంలో సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతిలో ఈ స్తబ్దత మరో వారం పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జూన్ 23వ తేదీ నాటికి వానలు సాధారణ స్థితికి చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. జూన్ 15 నుంచి జూన్ 21 మధ్య రుతు పవనాల కార్యకలాపాలు పెద్దగా చురుకుగా ఉండకపోవచ్చని అంటున్నారు. రానున్న వారంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు, అలాగే తూర్పు కనుమల్లో వాతావరణం అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.




