AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: థ్రిల్‌ కోసం బంగీ జంప్‌కి వెళ్తే.. సేఫ్టీ రోప్ కట్టకుండానే తోసేశారు..! కట్‌చేస్తే కళ్లముందే యువతి దుర్మరణం

Brazil bungee jump Accident Video: బ్రెజిల్‌లో రోప్ జంపింగ్ కార్యక్రమంలో ఘోర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. సేఫ్టీ రోప్ కట్టకుండా 21 ఏళ్ల యువతిని వంతెనపై నుంచి దూకించడంతో ఆమె 40 మీటర్ల లోతులో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Watch Video: థ్రిల్‌ కోసం బంగీ జంప్‌కి వెళ్తే.. సేఫ్టీ రోప్ కట్టకుండానే తోసేశారు..! కట్‌చేస్తే కళ్లముందే యువతి దుర్మరణం
Brazil Rope Jump Death
Srilakshmi C
|

Updated on: Jun 15, 2026 | 11:48 AM

Share

బ్రెజిల్‌, జూన్‌ 15: అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. బంగీ జంపింగ్‌లో పాల్గొన్న 21 ఏళ్ల యువతి సేఫ్టీ రోప్‌ను హార్నెస్‌కు అనుసంధానం చేయకుండా వంతెనపై నుంచి తోసేయడంతో సుమారు 40 మీటర్ల లోతు లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని మారియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రైటాస్గా గుర్తించారు. ఆమె ఇటీవలే ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందింది. తన కాబోయే భర్తతో కలిసి బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రం లిమీరా ప్రాంతంలోని స్కెలెటన్ బ్రిడ్జ్ (పోంటే డో ఎస్కెలెటో) వద్ద నిర్వహించిన రోప్ జంపింగ్ కార్యక్రమానికి హాజరైంది. జంప్‌కు ముందు సేఫ్టీ రోప్‌ను ఆమె హార్నెస్‌కు సరిగా అమర్చకుండా ఇద్దరు సిబ్బంది ఆమెను వంతెనపై నుంచి తోశేశారు. దీంతో ఆమె నేరుగా లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.

ప్రమాదాన్ని ముందే గుర్తించిన ప్రేక్షకులు

ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. యువతిని వంతెనపై నుంచి దూకించే క్షణానికి ముందు అక్కడున్న ఓ వ్యక్తి “గైస్… రోప్!” అంటూ అరవడం వీడియోలో వినిపించింది. ఆమెకు రోప్ అనుసంధానం కాలేదని గుర్తించినప్పటికీ అప్పటికే ఆలస్యమైపోయింది. యువతి కింద పడిపోవడంతో అక్కడున్న వారు వెంటనే సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

కాబోయే భర్త కళ్లముందే విషాదం

ఈ ఘటనను యువతి కాబోయే భర్త ప్రత్యక్షంగా చూశాడు. తన కళ్లముందే ఆమె పడిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై స్పృహ కోల్పోయాడు. అనంతరం అతడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జంప్‌కు కొద్దిసేపటి ముందు ఫ్రైటాస్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అందులో ప్రమాద హెచ్చరిక బోర్డు ఫొటో కూడా ఉంది. ‘నన్ను వంతెనపై నుంచి దూకడానికి అనుమతించిన పిచ్చివాడు ఎవరు?’ అంటూ సరదాగా చేసిన ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఘటన అనంతరం రోప్ జంపింగ్ కార్యక్రమం నిర్వహించిన సంస్థలకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారని, అనంతరం హెలికాప్టర్ సాయంతో అడవి ప్రాంతంలో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం, హత్యకు సమానమైన చర్యల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో అడ్వెంచర్ స్పోర్ట్స్ భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది.

Follow Us