Ghibli trend: గిబ్లీ ట్రెండ్ ఫాలో అవుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే..!
సోషల్ మీడియాలో ప్రస్తుతం గిబ్లీ స్టైల్ ఇమేజ్ లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఫొటోలను ఈ విధానంలో మార్చుకుని అప్ లోడ్ చేస్తున్నారు. చాట్ జీపీటీలో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ను యూజర్లు విపరీతంగా వినియోగిస్తున్నారు. మొదట్లో ఈ ఫీచర్ ప్రీమియం యూజర్లకు మాత్రమే లభించేది. తర్వాత ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మాన్ ఉచితమని ప్రకటించారు. దీంతో గిబ్లీ చిత్రాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే చాట్ జీపీటీలో వ్యక్తిగత చిత్రాలను అప్ లోడ్ చేయడం ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో గిబ్లీ చిత్రాల ట్రెండ్ విపరీతంగా కొనసాగుతున్నప్పటికీ అవి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏఐ ప్లాట్ ఫాంలో వ్యక్తిగత చిత్రాలను అప్ లోడ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. నిపుణులే కాదు ఇటీవల గోవా పోలీసులు కూడా సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ యాప్ లలో గిబ్లీ ఇమేజ్ ల కోసం వ్యక్తిగత చిత్రాలను అప్ లోడ్ చేసేముందు గోప్యతా ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
గిబ్లీ ట్రెంట్ ను యూజర్లు విపరీతంగా ఫాలో అవుతున్నప్పటికీ నిపుణులు హెచ్చరించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వేలాది వ్యక్తిగత ఫొటోలను యూజర్లు అప్ లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఓపెన్ ఏఐ డేటా బేస్ లో నిల్వ అవుతాయి. వ్యక్తులు తమ వ్యక్తిగత చిత్రాలను స్వచ్ఛందంగా అప్ లోడ్ చేసినప్పుడు, వారు ఆ చిత్రాలను ప్రాసెస్ చేయడానికి ఓపెన్ ఏఐకి అనుమతి ఇస్తారు. దీని ద్వారా చట్టపరమైన అనుమతి, స్వేచ్ఛ లభిస్తుంది.
ప్రమాదాలు ఇవే
- సాధారణంగా సోషల్ మీడియాలో తమ ఫొటోలను అప్ లోడ్ చేయని వ్యక్తులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గిబ్లీ ట్రెండ్ ను వినియోగిస్తున్నారు. తద్వారా ఓపెన్ ఏఐకి ఈ చిత్రాలపై సులభమైన యాక్సెస్ లభిస్తుంది.
- ప్రజలు తమ సరదా కోసం మూడో పక్ష ప్రొవైడర్ అవసరం లేకుండానే వారి వ్యక్తిగత ఫొటోలను అప్ లోడ్ చేస్తున్నారు.
- వ్యక్తులు తమ ఫొటోలను ఏఐతో పంచుకున్న తర్వాత, అవి ఎలా వినియోగించబడతాయో అనే దానిపై నియంత్రణ కోల్పోతారు. ఆ చిత్రాలు మీ పరువుకు నష్టం కలిగించేలా, వేధింపులకు ఉపయోగించేలా కంటెంట్ ను రూపొందించడానికి ఉపయోగించవచ్చు.
- మీ వ్యక్తిగత ఫొటోలను కొన్ని ప్రకటన కోసం కూడా వాడవచ్చు. లేకపోతే మూడో పక్షాలకు విక్రయించే ప్రమాదం కూడా పొంచి ఉంది.
- నిపుణులు, పోలీసులు చేస్తున్న హెచ్చరికలపై యూజర్లు కూాడా స్పందించారు. కొందరు గిబ్లీ చిత్రాలపై సానుకూలంగా మాట్లాడారు. మరి కొందరు ఈ విధానంలో ఇబ్బందులను అంగీకరించారు. ఇంకొందరు ఈ పరిశోధనతో ఏకీభవించారు.