AI పోటీతత్వంపై ప్రపంచ ర్యాంకింగ్స్ విడుదల.. ఇది కదా భారత్ సత్తా.. ఎన్నో స్థానం అంటే!
ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ అంటూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనూ అమెరికా, చైనాలకు పోటీగా తొడగొడుతోంది భారత్. కృత్రిమమేథలాంటి కొత్త ఆవిష్కరణలోనూ వడివడిగా అడుగులేస్తూ గ్లోబల్ ర్యాంకుల్లో టాప్ త్రీలో నిలిచింది మన దేశం. సాంకేతికంగా అప్‌డేట్ అవుతూ.. ఎకానమీలోనే కాదు భవిష్యత్తులో ఎందులోనైనా భారత్ టాప్ త్రీలో ఉంటుందనే సంకేతాలిస్తోంది.

ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ అంటూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనూ అమెరికా, చైనాలకు పోటీగా తొడగొడుతోంది భారత్. కృత్రిమమేథలాంటి కొత్త ఆవిష్కరణలోనూ వడివడిగా అడుగులేస్తూ గ్లోబల్ ర్యాంకుల్లో టాప్ త్రీలో నిలిచింది మన దేశం. సాంకేతికంగా అప్‌డేట్ అవుతూ.. ఎకానమీలోనే కాదు భవిష్యత్తులో ఎందులోనైనా భారత్ టాప్ త్రీలో ఉంటుందనే సంకేతాలిస్తోంది.
కంటికి కనిపించకుండానే అద్భుతాలు చేస్తున్నాయి. చిటికేసేలోపే పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి. మనిషి మేథస్సుకే పరీక్ష పెడుతున్నాయి. ఆఖరికి మనం తీసుకునే నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. టెక్నాలజీగానే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా మారిపోతోంది కృత్రిమ మేధస్సు. ఆరోగ్యం నుంచి విద్య వరకు.. బ్యాంకింగ్ నుంచి ఎంటర్‌టైన్మెంట్ దాకా .. ప్రతీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బలమైన ముద్రవేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2025లో AI వాడకం బాగా పెరిగింది. ఏఐ అభివృద్ధి, పరిశోధన, మోడల్ డెవలప్‌మెంట్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది అమెరికా. సిలికాన్ వ్యాలీ, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ.. ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని అగ్రభాగాన ఉంచాయి.
2024 గ్లోబల్ వైబ్రెన్సీ ఇండెక్స్‌లో అమెరికా 78.60 పాయింట్ల భారీ స్కోర్‌తో టాప్‌లో ఉంది. ప్రతిభ, ప్రజాభిప్రాయం అంశాలను మినహాయిస్తే సూచికలోని దాదాపు అన్ని విభాగాల్లో అమెరికానే టాప్‌లో ఉంది. ముఖ్యంగా R&D, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల రంగాల్లో యూఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. 2024లో ప్రముఖ AI మోడళ్ల తయారీ, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణలో ఆ దేశం ముందుంది. 2024లో విడుదలైన అనేక ప్రముఖ AI మోడళ్లను అమెరికా సంస్థలే అభివృద్ధి చేశాయి.
చైనా 36.95 స్కోర్‌తో 2024 గ్లోబల్ AI వైబ్రెన్సీ ఇండెక్స్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. పరిశోధన, అభివృద్ధి విభాగంలో చైనా అత్యుత్తమ ప్రదర్శన చూపింది. భారత్ 21.59 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచింది. కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచంలోనే మూడో అత్యంత పోటీ దేశంగా భారత్ అవతరించిందని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ నివేదిక వెల్లడించింది. భారత్‌లో వేగంగా ఎదుగుతున్న టెక్ ఎకోసిస్టమ్, నిష్ణాతులైన నిపుణులతో గ్లోబల్ AI పోటీలో భారత్ టాప్ త్రీలో నిలబడింది.
భారత్ తర్వాత 17.24 పాయింట్లతో దక్షిణ కొరియా, 16.64 స్కోర్‌తో యునైటెడ్ కింగ్‌డమ్ నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. 2023లో AIలో ఏడో స్థానంలో ఉన్న భారత్ 2024లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. యూకే ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎదిగింది. ఈ రెండు దేశాలు గ్లోబల్ AI వ్యవస్థలో తమ స్థానాన్ని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో ర్యాంకింగ్ మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా 87శాతం కంపెనీలు తమ వ్యాపార ప్రణాళికల్లో ఏఐకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాయి. మొత్తంగా 76శాతం సంస్థలు కనీసం ఒక విభాగంలో కృత్రిమ మేధను వాడుతున్నాయి
అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి. చైనాలో ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ సేవల్లో AI విస్తృతంగా అమలవుతోంది. భారత్‌లో బ్యాంకింగ్, ఈ-కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. జనాభా, విస్తృత మార్కెట్ కారణంగా AIని ప్రాక్టికల్‌గా ఉపయోగించడంలో భారత్, చైనా పోటాపోటీగా ముందున్నాయి. అదే సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో చూస్తే చైనా కంటే భారతే AI వినియోగంలో ముందుంది. యూరప్‌లో మాత్రం AI కంటెంట్ వాడకంపై ఆంక్షలున్నాయి. ప్రత్యేక చట్టం ద్వారా ఎథికల్ AI వినియోగంపై ఈయూ మార్గదదర్శకాలు జారీచేసింది.
నోడౌట్.. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ అగ్రదేశాలతో పోటీపడుతోంది. కానీ అమెరికా, చైనాతో సమానంగా పోటీపడాలంటే భారత్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. రాబోయే కొన్నేళ్లలో భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులకు గ్లోబల్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. 2030 నాటికి AI, లాజిస్టిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల్లో అమెజాన్.. 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కూడా క్లౌడ్, AI విస్తరణ కోసం 17.5 బిలియన్ పెట్టుబడిని ప్రకటించింది. ఇంటెల్, కాగ్నిజెంట్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు కూడా ఇదివరకే పెట్టుబడులు, భాగస్వామ్య ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో వచ్చే రెండుమూడేళ్లలో భారత్‌లో AI టెక్నాలజీ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లబోతోంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




