తెలుగు కుర్రాడికి ఘోర అవమానం..! ఈ చెత్త నిర్ణయం తీసుకుంది ఎవరు?
ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్‌గా పంపడం వివాదానికి దారితీసింది. అతని ప్రదర్శన బాగున్నప్పటికీ, చివరి ఓవర్‌లో అతని స్థానంలో శాంట్నర్‌ను పంపడంపై విమర్శలు వస్తున్నాయి. ముంబై ఓటమికి ఇది కారణమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం తిలక్ వర్మ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉన్న యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ తిలక్ వర్మకు ఘోర అవమానం జరిగింది. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై బ్యాటింగ్ ఆఖరి ఓవర్‌కి ముందు సీన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. తిలక్ వర్మ సడెన్‌గా గ్రౌండ్ వీడి వెళ్లిపోవడంతో స్టేడియంలో ఉన్న వాళ్లందరికీ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అసలేం జరిగిందంటే.. లక్నోపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మూడో స్థానంలో రావాల్సిన తిలక్ వర్మను ముంబై ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించింది.
సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తిలక్ వర్మ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. స్కై భారీ షాట్లతో వేగంగా ఇన్నింగ్స్ ఆడుతుంటే, తిలక్ వర్మ సూర్యకి స్ట్రయికింగ్ ఇస్తూ నెమ్మదిగా ఆడాడు. అయితే, 17వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ అవుటైనా.. కూడా తిలక్ గేరు మార్చలేదు. ముంబై ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీసిన హార్దిక్ పాండ్యా సింగిల్ తీశాడు. ఆఖరి బంతికి తిలక్ స్ట్రయికింగ్‌లోకి వచ్చిన తిలక్ ఆ బాల్‌ను ఎదుర్కొకుండా రిటైర్డ్ అవుట్‌గా వెళ్లిపోయాడు. అంటే అవుట్ కాకుండానే క్రీజ్ వదిలిపెట్టి, తర్వాత బ్యాటర్‌కు అవకాశం ఇవ్వడం. ఇంకా కొట్టాల్సిన స్కోర్ చాలా ఉంది.. తిలక్ కొట్టలేడని భావించి అతన్ని పంపి సాంట్నర్‌ను బ్యాటింగ్‌కు పిలిపించారన్న మాట. ఏడు బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ వర్మను బయటకు పంపించడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు.
తిలక్ వర్మ ఉండుంటే ఆఖరి బంతికి బౌండరీ బాదేవాడేమో? లేక ఆఖరి ఓవర్‌లో సిక్సర్లు కొట్టేవాడేమో? కదా అని టీమిండియా మాజీలు అంటున్నారు. తిలక్ స్థానంలో వచ్చిన శాన్‌ట్నర్ ఆఖరి బంతికి రెండు పరుగులు మాత్రమే తీశాడు. చివరి ఓవర్‌లో స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా ఒక సిక్సర్‌తో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గురించి ప్రశ్నించగా.. అతను షాట్స్ కొట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అందుకే రిటైర్డ్ అవుట్‌గా పంపించాము. ఆ సమయంలో ముంబైకి షాట్స్ కావాలని హార్దిక్ సమాధానం ఇచ్చాడు. అది టీమ్ నిర్ణయంగా హార్థిక్ చెప్పినప్పటికీ.. ముందుగా ఆ ఆలోచన ఎవరికి వచ్చిందో వెల్లడించలేదు. అయితే.. ఒక యంగ్ ప్లేయర్‌ను ఇలా వెనక్కి పంపితే అతని కాన్ఫిడెన్స్ ఎంతలా దెబ్బతింటుందో అనే విషయం కనీసం ఆలోచించలేదా అని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం తర్వాత తిలక్ కూడా చాలా బాధ, కోపంలో కనిపించాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.