Jemimah Rodrigues : ఆమె ఆటే కాదు..ఆలోచన కూడా సూపరే..మహిళల కోసం జెమిమా రోడ్రిగ్స్ సరికొత్త అవతారం
Jemimah Rodrigues : మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ మైదానంలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె అదే ఉత్సాహంతో మహిళల సాధికారత, భద్రత దిశగా ఒక కీలక అడుగు వేశారు. మహిళల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా హెల్మెట్‌లను రూపొందించే ట్వారా కంపెనీతో జెమిమా దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నారు.

Jemimah Rodrigues : మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ మైదానంలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె అదే ఉత్సాహంతో మహిళల సాధికారత, భద్రత దిశగా ఒక కీలక అడుగు వేశారు. మహిళల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా హెల్మెట్‌లను రూపొందించే ట్వారా కంపెనీతో జెమిమా దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆమె కంపెనీలో ఈక్విటీ భాగస్వామిగా వ్యవహరిస్తారు. మహిళలు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని, తమ రక్షణను తామే చూసుకోవాలనే స్పృహ కల్పించడంలో జెమిమా క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.
ఈ భాగస్వామ్యం గురించి జెమిమా రోడ్రిగ్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “క్రీడలు మనకు క్రమశిక్షణ, నిలకడ, నమ్మకాన్ని నేర్పుతాయి. సామాన్య మహిళలకు వారి దైనందిన జీవితం కూడా ఇవే విషయాలను నేర్పుతుంది. మహిళలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే సరైన భద్రత ఉంటే వారికి మరింత ధైర్యం వస్తుంది. ట్వారా కంపెనీ ఈ రెండు అంశాలపై దృష్టి సారించింది. అందుకే ఈ భాగస్వామ్యం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్ని ఇస్తోంది” అని ఆమె తెలిపారు. భవిష్యత్తులో మహిళా రైడర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త డిజైన్లను తీసుకురావడంలో జెమిమా తన సలహాలను కూడా అందించనున్నారు.
ట్వారా వ్యవస్థాపకురాలు అల్పనా పరీదా మాట్లాడుతూ.. జెమిమా వంటి స్ఫూర్తిదాయకమైన క్రీడాకారిణి తమ కంపెనీలో చేరడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. జెమిమాలో ఉన్న క్రమశిక్షణ, ఉత్సాహం, లక్ష్యం పట్ల ఉన్న స్పష్టత.. తమ కంపెనీ ఆలోచనలతో సరిగ్గా సరిపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కంపెనీ హెల్మెట్‌లు ఆన్‌లైన్ ద్వారా దేశవ్యాప్తంగా 600కు పైగా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే 2026 నాటికి ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్‌లోకి ప్రవేశించి, ప్రతి నగరంలోని స్టోర్లలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
