Shikhar Dhawan : మనుషులా? మృగాలా?.. గుండె తరుక్కుపోతోంది..బంగ్లాదేశ్ బీభత్సంపై శిఖర్ ధావన్ ఆగ్రహం
Shikhar Dhawan : తాజాగా ఒక హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కిరాతక చర్యపై టీమిండియా మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ ఎక్స్ వేదికగా స్పందించారు.

Shikhar Dhawan : బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అక్కడ జరుగుతున్న వరుస దాడులు, హత్యలు మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా ఒక హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కిరాతక చర్యపై టీమిండియా మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ ఎక్స్ వేదికగా స్పందించారు. “బంగ్లాదేశ్‌లో ఒక హిందూ వితంతువుపై జరిగిన క్రూరమైన దాడి గురించి చదివి నా మనసు వికలమైంది. ఎక్కడైనా, ఎవరిపైనా ఇలాంటి హింసను అంగీకరించలేము. బాధితురాలికి న్యాయం జరగాలని, ఆమెకు తగిన మద్దతు లభించాలని నేను ప్రార్థిస్తున్నాను” అని ధావన్ పోస్ట్ చేశారు.
బంగ్లాదేశ్‌లో గత డిసెంబర్ నెల నుంచి హింసాత్మక ఘటనలు పెచ్చుమీరాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే కనీసం ఆరుగురు హిందూ పురుషులను దారుణంగా హత్య చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. మృతులలో వ్యాపారులు, సామాన్య పౌరులు ఉన్నారు. వీరిని కాల్చి చంపడం లేదా కత్తులతో పొడిచి చంపడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వితంతువుపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాల్లో భయాందోళనలను పెంచింది. మానవ హక్కుల సంఘాల ప్రకారం.. వందలాది హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి, ఆస్తులను లూటీ చేశారు.
గతేడాది జూలైలో సింగపూర్‌లో జరిగిన తిరుగుబాటుకు కారకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. అప్పటి నుండి నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఈ రాజకీయ అశాంతిని ఆసరాగా చేసుకున్న మతోన్మాద శక్తులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.
Heartbreaking to read about the brutal assault on a Hindu widow in Bangladesh. Such violence against anyone, anywhere is unacceptable. Prayers for justice and support for the survivor. 🙏
— Shikhar Dhawan (@SDhawan25) January 7, 2026
శిఖర్ ధావన్ కంటే ముందే మరికొందరు క్రీడాకారులు, ప్రముఖులు బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ కోసం గొంతు వినిపించారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఐపీఎల్, ఇతర క్రికెట్ లీగ్స్ విషయంలో ఇప్పటికే భారత్-బంగ్లా మధ్య ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో, ధావన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. క్రీడాకారులు కేవలం ఆటకే పరిమితం కాకుండా, సామాజిక అన్యాయాలపై స్పందించడాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.
