53 శాతం పెరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. విజేతకే కాదు, ప్రతీ జట్టుపైనా కాసుల వర్షమే?
Champions Trophy Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ మొత్తాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో ఏ జట్టు కూడా ఖాళీ చేతులతో తిరిగి రాదు. అదేవిధంగా, గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచినందుకు కూడా డబ్బు అందనుందన్నమాట.

Champions Trophy Prize Money: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రైజ్ మనీని ప్రకటించింది. 8 జట్ల మధ్య జరిగే ఈ టోర్నమెంట్ కోసం ఐసీసీ భారీ ప్రైజ్ మనీని అందించనుంది. విశేషమేమిటంటే, గత ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ప్రైజ్ మనీని 53% పెంచారు. అదే సమయంలో, గ్రూప్ దశలో మ్యాచ్‌లు గెలిచినందుకు జట్లకు ప్రత్యేకంగా డబ్బు అందనుంది. టోర్నమెంట్‌లో చివరి స్థానంలో నిలిచిన జట్టు కూడా ఖాళీ చేతులతో తిరిగి రాదన్నమాట.
ఛాంపియన్ జట్టుపై కోట్ల రూపాయలు..
8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తిరిగి రాబోతోంది. ఈ టోర్నమెంట్ ఇంతకు ముందు 2017 సంవత్సరంలో జరిగింది. ఈసారి ప్రైజ్ మనీ మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే 53% పెంచారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ప్రైజ్ మనీ US$6.9 మిలియన్లు. ఈసారి ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు 2.24 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు అందనున్నాయి. అదే సమయంలో, రన్నరప్ జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు లభిస్తాయి. దీనితో పాటు, సెమీ-ఫైనల్లో ఓడిన రెండు జట్లకు కూడా దాదాపు రూ.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనున్నాయి.
ప్రత్యేకత ఏమిటంటే గ్రూప్ దశలో ఎలిమినేట్ అయ్యే జట్లు కూడా ఖాళీ చేతులతో వెళ్లవు. ఐదవ లేదా ఆరవ స్థానంలో నిలిచిన జట్లకు 3.5 లక్షల డాలర్లు, అంటే దాదాపు 3 కోట్ల రూపాయలు లభిస్తాయి. అదే సమయంలో, 7వ, 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు 1 లక్ష 40 వేల డాలర్లు అంటే 1 కోటి 20 లక్షల రూపాయలు అందనున్నాయి. ఇది కాకుండా, గ్రూప్ దశలో ప్రతి విజయానికి 34 వేల డాలర్లు అంటే సుమారు 30 లక్షల రూపాయలు దక్కనున్నాయి. మరోవైపు, ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నందుకు ఎనిమిది జట్లకు $125,000 అంటే విడివిడిగా సుమారు రూ.1 కోటి ఇవ్వనున్నారు.
ఐసీసీ అధ్యక్షుడు జై షా కీలక ప్రకటన..
ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ, ‘ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 క్రికెట్‌కు కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ప్రతి మ్యాచ్ వన్డే ఫార్మాట్ అద్భుతాన్ని హైలైట్ చేస్తుంది. దీంతో ఈ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్‌కు పునరుజ్జీవం తీసుకొస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..