HCAపై కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు! స్పందించిన బీసీసీఐ
కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీ. ఆగమ్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. జిల్లా స్థాయి క్రికెట్ అభివృద్ధిని హెచ్‌సీఏ విస్మరిస్తోందని, బీసీసీఐ నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీసీసీఐ అంబుడ్స్‌మెన్, ఈ విషయంలో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీ.ఆగమ్ రావు చేసిన ఫిర్యాదుకు బీసీసీఐ స్పందించింది. ఈ నెల 8న ఆగమ్ రావు బీసీసీఐకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ విషయంలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. బీసీసీఐ ఆదేశాలు, సిఫార్సులు పాటించడంలో విఫలమైన హెచ్‌సీఏపై అపెక్స్ కౌన్సిల్ చర్య తీసుకోకపోవడంపై రూల్ 41(1)(b) కింద ఆగమ్ రావు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ ప్రమోషన్ కోసం బీసీసీఐ భారీ ఎత్తున నిధులను కేటాయించినప్పటికీ, హెచ్‌సీఏ తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిని విస్మరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో క్రికెట్‌ను హెచ్‌సీఏ ప్రొత్సహించడం లేదని, 2018, 2021లో బీసీసీఐ జారీ చేసిన ఆదేశాలల్లో జిల్లా స్థాయి అభివృద్ధి కార్యకలాపాల వివరాలను హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని పేర్కొంది. కానీ, వాటిని ఇప్పటివరకు హెచ్‌సీఏ అమలు చేయలేదు. తెలంగాణ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే 9 మంది మాత్రమే హెచ్‌సీఏలో సభ్యులను ఉన్నారు. అలా కాకుండా రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి కనీసం ఒక సభ్యుడిని హెచ్‌సీఏలో ఓటింగ్ సభ్యులుగా చేర్చాలని బీసీసీఐ గతంలో హెచ్‌సీఏకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. గతంలో జారీ చేసిన ఉత్తర్వల్లో 6 నెలల్లోపు ఇతర జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యల నివేదికను సిద్ధం చేయాలని కూడా బీసీసీఐ హెచ్‌సీఏను ఆదేశించింది.
అలాగే ఈ విషయంలో తీసుకున్న నిర్దిష్ట చర్యలను వివరిస్తూ ప్రతి 6 నెలలకు ఒకసారి బీసీసీఐకి నివేదిక సమర్పించాలని, ఆ నివేదికను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని బీసీసీఐ ఆదేశించింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులలో 25 శాతం ప్రత్యేకంగా జిల్లాల్లో క్రికెట్ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయాలని హెచ్‌సీఏ తన యానువల్ జనరల్ మీటింగ్‌లో తీర్మాణం చేసింది. దాన్ని కూడా హెచ్‌సీఏ అమలు చేయలేకపోయింది. ఇలా హెచ్‌సీఏపై అనేక ఆరోపణలు చేస్తూ.. కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. మరి బీసీసీఐ అంబుడ్స్‌మెన్ సూచన మేరకు ఈ వివాదంలో అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకొని.. హెచ్‌సీఏపై విచారణకు ఆదేశిస్తుందో లేదో చూడాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..