Auqib Nabi : వామ్మో వీడేంటి ఇంత వయలెంటుగా ఉన్నాడు..7 వికెట్లు పడినా..ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు
Auqib Nabi : విజయ్ హజారే ట్రోఫీలో ఊహించని అద్భుతం జరిగింది. అసలు గెలుస్తుందన్న ఆశలే లేని స్థితి నుంచి ఒక బౌలర్ బ్యాట్ పట్టుకుని వీరవిహారం చేస్తే ఎలాగ ఉంటుందో అని జమ్మూ కాశ్మీర్ ఆటగాడు ఆకిబ్ నబీ చూపించాడు.

Auqib Nabi : విజయ్ హజారే ట్రోఫీలో ఊహించని అద్భుతం జరిగింది. అసలు గెలుస్తుందన్న ఆశలే లేని స్థితి నుంచి ఒక బౌలర్ బ్యాట్ పట్టి వీరవిహారం చేస్తే ఎలా ఉంటుందో జమ్మూ కాశ్మీర్ ఆటగాడు ఆకిబ్ నబీ చూపించాడు. రాజ్‌కోట్ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆకిబ్ నబీ అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 50 ఓవర్లలో 268 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. జమ్మూ కాశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీ బౌలింగ్‌లోనూ మెరిశాడు. 10 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను కట్టడి చేశాడు. అయితే అసలైన మ్యాజిక్ ఇన్నింగ్స్ రెండో భాగంలో మొదలైంది. లక్ష్య చేధనలో జమ్మూ కాశ్మీర్ ఘోరంగా విఫలమైంది. కేవలం 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హైదరాబాద్ విజయం ఖాయమనుకున్న తరుణంలో ఆకిబ్ నబీ బ్యాట్‌తో సునామీ సృష్టించాడు.
ఎనిమిదో నంబర్ బ్యాటర్‌గా వచ్చిన ఆకిబ్ నబీ.. బౌలర్ లా కాకుండా టాప్ ఆర్డర్ బ్యాటర్ లా రెచ్చిపోయాడు. కేవలం 82 బంతుల్లోనే 114 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆకిబ్ కు 9వ నంబర్ బ్యాటర్ వంశజ్ శర్మ (69 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే స్కోరు బోర్డును పరిగెత్తించారు. దీంతో 47.5 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి జమ్మూ కాశ్మీర్ లక్ష్యాన్ని చేరుకుంది.
ఆకిబ్ నబీకి ఇది లిస్ట్-ఏ కెరీర్‌లో తొలి సెంచరీ. గత 35 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క అర్థ సెంచరీ కూడా లేని ఈ ఆటగాడు, ఏకంగా సెంచరీతో జట్టును గెలిపించడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఇటీవల జరిగిన మెగా వేలంలో ఢిల్లీ టీమ్ ఇతనిని 8.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తాను కేవలం బౌలర్ మాత్రమే కాదు, అవసరమైతే మ్యాచ్ ఫినిష్ చేయగల ఆల్ రౌండర్ అని ఆకిబ్ నేటి ఆటతో నిరూపించుకున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
