Hardik Pandya : బీసీసీఐ నిబంధనలు బ్రేక్ చేస్తూ 10 ఓవర్ల బౌలింగ్..చిక్కుల్లో పడనున్న స్టార్ ఆల్ రౌండర్!
Hardik Pandya : న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం టీమిండియాను సెలక్ట్ చేసినప్పుడు హార్దిక్ పాండ్యా 10 ఓవర్ల బౌలింగ్ చేయడానికి ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్ కాలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవాలని నేషనల్ క్రికెట్ అకాడమీ, సెలక్టర్లు భావించారు.

Hardik Pandya : భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన ఆటతోనే కాకుండా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో చర్చనీయాంశమయ్యారు. విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరపున ఆడుతున్న పాండ్యా, చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టినప్పటికీ, బోర్డు పెట్టిన ఒక ముఖ్యమైన నిబంధనను పక్కన పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
నిజానికి న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం టీమిండియాను సెలక్ట్ చేసినప్పుడు హార్దిక్ పాండ్యా 10 ఓవర్ల బౌలింగ్ చేయడానికి ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్ కాలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవాలని నేషనల్ క్రికెట్ అకాడమీ, సెలక్టర్లు భావించారు. కానీ విజయ్ హజారే ట్రోఫీలో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఏకంగా 10 ఓవర్ల కోటాను పూర్తి చేశారు. ఈ 10 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. బోర్డు వారించినా కూడా పాండ్యా ఇంత రిస్క్ తీసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
బౌలింగ్‌లో నిబంధనలు పక్కన పెట్టిన పాండ్యా, బ్యాటింగ్‌లో మాత్రం తన విశ్వరూపం చూపించారు. కేవలం 31 బంతుల్లోనే 75 పరుగులు చేసి మైదానంలో పరుగుల వరద పారించారు. ఇతని ఇన్నింగ్స్‌లో 9 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. 240కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడిన పాండ్యా ప్రతాపానికి బరోడా జట్టు 391 పరుగుల భారీ స్కోరు సాధించింది. సమాధానంగా చండీగఢ్ 242 పరుగులకే కుప్పకూలడంతో బరోడా ఘనవిజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌ల్లో పాండ్యా ఏకంగా 20 సిక్సర్లు బాదడం గమనార్హం.
ఫిట్‌నెస్ విషయంలో బోర్డు ఆదేశాలను ధిక్కరించినందుకు పాండ్యాకు బీసీసీఐ నుంచి మొట్టికాయలు పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ లేదా ఎన్‌సీఏ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ఆయన బౌలింగ్ చేశారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అనుమతి లేకుండానే బౌలింగ్ చేసి ఉంటే, భవిష్యత్తులో గాయాల బారిన పడితే అది జట్టుకు పెద్ద లోటు అవుతుంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
