వార్నీ.. క్యాలెండర్ వల్ల కూడా దరిద్రం వస్తుందా.. ఈ దిశలో ఉంచితే తిప్పలు తప్పవు..
Vastu Tips: క్యాలెండర్‌ను ఏ గోడకు పడితే ఆ గోడకు తగిలిస్తున్నారా? అయితే మీరు తెలియకుండానే దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నట్టే.. వాస్తు శాస్త్రం ప్రకారం.. క్యాలెండర్ కేవలం తేదీల పట్టిక మాత్రమే కాదు, అది మీ ఇంటి కాలచక్రాన్ని నిర్దేశించే ఒక శక్తి. ఒక చిన్న పొరపాటు మీ పురోగతిని అడ్డుకుంటే.. సరైన దిశ మీ ఇంటికి సిరిసంపదలను తెచ్చిపెడుతుంది. క్యాలెండర్‌ను ఏ దిశలో ఉంచాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

2026 కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే, ప్రతి ఇంట్లోనూ ముందుగా మారేది క్యాలెండర్. పండుగలు, సెలవు దినాలు, శుభ ముహూర్తాల కోసం మనం క్యాలెండర్‌ను చూస్తుంటాం. అయితే చాలామంది తమకు నచ్చిన చోట లేదా ఖాళీగా ఉన్న గోడకు క్యాలెండర్‌ను వేలాడదీస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. క్యాలెండర్ కేవలం తేదీలను తెలిపే కాగితం మాత్రమే కాదు, అది మీ ఇంట్లోని శక్తి ప్రవాహాన్ని శాసించే ఒక వస్తువు. సరైన దిశలో క్యాలెండర్ లేకపోతే ప్రతికూల శక్తి పెరిగి, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి 2026లో మీ అదృష్టం ప్రకాశించాలంటే క్యాలెండర్‌ను ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పురోగతి కావాలా? తూర్పు దిశే బెస్ట్
మీరు కొత్త లక్ష్యాలను చేరుకోవాలని, జీవితంలో ఎదగాలని ఆశిస్తుంటే.. క్యాలెండర్‌ను తూర్పు ముఖంగా ఉన్న గోడపై ఉంచండి. తూర్పు సూర్యోదయ దిశ. ఇది కొత్త ప్రారంభాలకు, విజయానికి చిహ్నం. స్ఫూర్తినిచ్చే కోట్స్ లేదా సూర్యోదయ చిత్రాలు ఉన్న క్యాలెండర్లు ఈ దిశలో ఉంటే సానుకూలత రెట్టింపు అవుతుంది.
ఆర్థిక లాభాల కోసం ఉత్తర దిశ
వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటే ఉత్తర దిశలో క్యాలెండర్ వేలాడదీయడం శుభప్రదం. ఉత్తర దిశ కుబేరుడి స్థానంగా భావిస్తారు. ఇది స్థిరత్వాన్ని, కొత్త ఆదాయ మార్గాలను సూచిస్తుంది. వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ దిశ ఎంతో మేలు చేస్తుంది.
మనశ్శాంతి కోసం ఈశాన్యం
ఇంట్లో గొడవలు లేకుండా, ప్రశాంతత నెలకొనాలంటే ఈశాన్య మూల ఉత్తమం. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, దైవ భక్తిని ప్రతిబింబించే చిత్రాలు ఉన్న క్యాలెండర్లను ఇక్కడ ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.
బంధాలు బలపడాలంటే నైరుతి
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలని కోరుకునే వారు నైరుతి దిశను ఎంచుకోవాలి. ఇది అనుబంధాలకు చిహ్నం. కుటుంబ చిత్రాలు లేదా ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న క్యాలెండర్లు ఇక్కడ ఉంచితే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చోట్ల క్యాలెండర్ ఉంచడం నిషిద్ధం
దక్షిణ దిశ: క్యాలెండర్‌ను ఎప్పుడూ దక్షిణ గోడకు తగిలించకూడదు. ఇది పురోగతిని అడ్డుకుంటుందని నమ్మకం.
తలుపులు, కిటికీలు: తలుపు వెనుక లేదా కిటికీలకు ఎదురుగా క్యాలెండర్ ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది.
పాత క్యాలెండర్లు: కొత్త సంవత్సరం వచ్చాక పాత క్యాలెండర్లను తీసేయాలి. పాతవి అలాగే ఉంచడం వల్ల కాలం కలిసి రాదని వాస్తు చెబుతోంది.
ఈ 2026లో కేవలం తేదీలను మార్చడమే కాదు.. క్యాలెండర్ దిశను కూడా మార్చి చూడండి. వాస్తు నియమాలను పాటిస్తూ సరైన స్థానంలో క్యాలెండర్ ఉంచి, మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించండి.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.




