ఈ రాశుల వారికి అప్పు ఇస్తే అంతే సంగతులు.. తిరిగి రావడం కష్టమే.. జ్యోతిష్యశాస్త్రం ఏం చెప్తుందంటే..?
డబ్బు ఇచ్చినప్పుడు ఉన్నంత సంతోషం.. అది తిరిగి తీసుకునేటప్పుడు ఉండదు. కొందరికి అప్పు ఇస్తే అడగకుండానే ఇచ్చేస్తారు. మరికొందరి వెనుక మాత్రం చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుంది. అయితే, ఒక వ్యక్తి డబ్బు తిరిగి ఇచ్చే స్వభావం వారి రాశిపై కూడా ఆధారపడి ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అప్పుల విషయంలో ఏ రాశి వారితో జాగ్రత్తగా ఉండాలి..? అనేది తెలుసుకుందాం..

వ్యాపారమైనా, స్నేహమైనా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటాయి. అయితే కొందరికి డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రావడం చాలా కష్టమవుతుంటుంది. దీనికి కేవలం వారి ఉద్దేశం మాత్రమే కాదు వారి రాశిచక్రం, గ్రహాల ప్రభావం కూడా కారణం కావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. నిర్దిష్ట రాశులకు చెందిన వ్యక్తులు ఆర్థిక లావాదేవీల విషయంలో ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారు అప్పు తిరిగి చెల్లించే విషయంలో కాస్త నిర్లక్ష్యంగా లేదా జాప్యం చేసే అవకాశం ఉందట. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి
ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరు విలాసాలను అమితంగా ఇష్టపడతారు. ఆ విలాసాల కోసం అప్పులు చేయడానికి వెనుకాడరు. కానీ తీర్చే సమయం వచ్చేసరికి వీరిలోని భద్రతా భావం మేల్కొంటుంది. డబ్బు ఇస్తే తమ పొదుపు తగ్గిపోతుందని భయపడి, అప్పు తీర్చడాన్ని వాయిదా వేస్తూ ఉంటారు.
మిథున రాశి
బుధుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు మాటకారులు. వీరి దగ్గర డబ్బు ఉన్నప్పటికీ, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. అప్పు తీర్చాలనే విషయాన్ని కొన్నిసార్లు మర్చిపోతారు లేదా సరైన ప్లానింగ్ లేక డబ్బును ఇతర అవసరాలకు వాడేస్తారు.
ధనుస్సు రాశి
బృహస్పతి ప్రభావం వల్ల వీరు చాలా ఆశావాదులు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ప్రయాణాలు, సాహసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. అప్పుల విషయంలో వీరు చాలా ఉదాసీనంగా ఉంటారు. డబ్బు ఎక్కడికి పోతుందిలే.. తర్వాత ఇద్దాం అనే వీరి వైఖరి అప్పు ఇచ్చిన వారికి చికాకు కలిగిస్తుంది.
మీన రాశి
భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే మీన రాశి వారు ఆర్థిక విషయాల్లో కాస్త వీక్. వీరు తమ డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో కూడా అర్థం చేసుకోలేరు. తీరా అప్పు తీర్చే గడువు వచ్చేసరికి, వీరి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. కఠినమైన ఆర్థిక వాస్తవాల కంటే ఊహాజనిత ప్రపంచంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం.
మీ జాతకంలో రెండవ ఇల్లు (సంపద), పదకొండవ ఇల్లు (లాభం) బలహీనంగా ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ తగ్గుతుంది. అప్పుల బాధల నుండి బయటపడటానికి ఇవి చేయండి.. శని దేవుడిని, కుజుడిని ఆరాధించడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఈ రాశుల వారు ఏదైనా ఖర్చు చేసే ముందు ఒక డైరీలో రాసుకోవడం లేదా రిమైండర్లు పెట్టుకోవడం వల్ల సామాజిక ప్రతిష్టను కాపాడుకోవచ్చు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.
