ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారో తెలుసా..? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..
కొత్త ఇల్లు కట్టినా, శుభకార్యం జరిగినా సింహద్వారం ముందు పెద్ద గుమ్మడికాయ వేలాడదీయడం మనం చూస్తూనే ఉంటాం. అసలు రంగురంగుల పూల అలంకరణలు ఉండగా, కేవలం గుమ్మడికాయనే ఎందుకు కడతారు..? దీని వెనుక ఉన్నది కేవలం నమ్మకమేనా లేక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? అదృష్టానికి సంకేతంగా భావించే గుమ్మడి వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం ఉంటుంది. కొత్త ఇల్లు కట్టినా, పండుగలు వచ్చినా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించినా.. ఇంటి సింహద్వారం ముందు గుమ్మడికాయను వేలాడదీయడం మనం చూస్తుంటాం. కేవలం దిష్టి తగలకుండా ఉండటానికే కాకుండా దీని వెనుక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
దుష్ట శక్తులకు విరుగుడు..
శాస్త్రాల ప్రకారం గుమ్మడికాయను కూష్మాండం అని పిలుస్తారు. గుమ్మడికాయకు గాలిలోని ప్రతికూల తరంగాలను లేదా ఇతరుల అసూయ, ద్వేషం వంటి దృష్టి దోషాలను గ్రహించే శక్తి ఉందని నమ్ముతారు. ఇది సాత్విక గుణాన్ని కలిగి ఉండి, ఇంటికి శుభ సంకేతాలను, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.
జంతు బలికి ప్రత్యామ్నాయంగా..
పురాతన కాలంలో గ్రామ దేవతలకు లేదా శక్తి స్వరూపిణికి జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండేది. అయితే హింసను నివారించే ఉద్దేశంతో శాంతియుత మార్గంగా గుమ్మడికాయను బలి ఇవ్వడం ప్రారంభించారు. గుమ్మడికాయను పగలగొట్టి దానికి కుంకుమ పూయడం వల్ల వచ్చే ఎరుపు రంగును రక్తంగా భావించి, దుష్ట శక్తులను శాంతింపజేయడానికి దీనిని ఉపయోగిస్తారు.
శాస్త్రీయ కోణం ఏంటి?
ఆధ్యాత్మికతతో పాటు దీని వెనుక ఒక శాస్త్రీయ కోణం కూడా ఉందని కొందరి నమ్మకం.
బ్యాక్టీరియా నివారణ: గుమ్మడికాయలోని కొన్ని సహజ గుణాలు గాలిలోని బ్యాక్టీరియాను, క్రిములను గ్రహించడంలో సహాయపడతాయని చెబుతారు.
ప్రమాదాల నివారణ: గుమ్మడికాయను పగలగొట్టినప్పుడు అది రోడ్డుపై లేదా నడిచే దారిలో ముక్కలుగా మారుతుంది. అయితే వీటిపై ఎవరైనా జారిపడే అవకాశం ఉన్నందున, దృష్టి తీసిన తర్వాత వాటిని పక్కన పడేయడం లేదా శుభ్రం చేయడం బాధ్యతగా భావించాలి.
కొబ్బరికాయతో మొదలై.. గుమ్మడికాయతో ముగింపు
హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం కొబ్బరికాయ కొట్టడంతో ప్రారంభమైతే దృష్టిని తొలగించి గుమ్మడికాయ కొట్టడంతో ముగుస్తుంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ప్రజల బలమైన నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
