Ayodhya: రామాలయాన్ని చూస్తున్న ఉడుత విగ్రహం ఏర్పాటు.. రామాయణంలో ఈ చిరు జీవి పాత్ర ఏమిటో తెలుసా..
కోట్లాది హిందువుల కల తీరి.. రామ జన్మ భూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుపుకుంటుంది. ఇప్పటికే గర్భ గుడిలో కొలువుదీరిన బాల రామయ్యను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది చివరికి రామాలయం సంపూర్ణంగా నిర్మాణం పూర్తి అయ్యే విధంగా పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా రామ జన్మభూమి స్థలంలో ఉడుత విగ్రహాన్ని ఏర్పాటు చేశామని రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు.

అయోధ్యలో రామాయణం నిర్మాణం పూర్తి కానున్న తరుణంలో రామ జన్మభూమి స్థలంలో ఒక ఉడుత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. రామాయణంలో ఉడుత ప్రతీకాత్మక పాత్రను గుర్తిస్తూ రామాలయ ట్రస్ట్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహాన్ని అంగద్ తీలా వద్ద ఉంచారు. అక్కడి నుంచి ఉడుత బాల రామయ్య కొలువుదీరిన ఆలయాన్ని చూస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే రామాయణంలో చిరు జీవి ఉడుత పాత్ర గురించి తెలుసుకుందాం.
రామాయణంలో ఉడుత పాత్ర రామాయణంలో రామ సేతు నిర్మాణం సమయంలో రాముడిపై భక్తి, రామ కార్యం పూర్తి చేయడానికి ఉడుత చూపిన అంకితభావం, హృదయపూర్వకమైన కృషిని తెలిపింది. అందుకనే నేటికీ ఉడుతా భక్తి అనే సామెత ప్రాచుర్యంలో నిలిచింది.
ఉడుత చూపిన అంకితభావం, భక్తి,శ్రమ
వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ రాముడి వానరసేన సీత దేవిని చేరుకోవడానికి రామసేతు (నదిని దాటడానికి వంతెన) నిర్మిస్తున్నప్పుడు.. ఒక చిన్న ఉడుత కూడా సేవ చేసింది. వానరాలు పెద్ద పెద్ద బండరాళ్లు, రాళ్లను మోసుకెళ్తుండగా.. ఒక చిన్న ఉడుత మాత్రం ఇసుక, చిన్న గులకరాళ్ళను శ్రద్ధగా మోసుకెళ్లింది. ఉడుత ఈ పనిని పూర్తి అంకితభావంతో చేస్తూ.. వంతెన నిర్మాణానికి దోహదపడుతోంది. అయితే ఉడుత చేస్తున్న సాయం చూసిన కొన్ని వానరాలు ఉడుతను ఎగతాళి చేస్తూ.. నువ్వు చాలా చిన్న జీవివి.. రాళ్ల కింద పడితే సమాధి అవుతావు. కనుక ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాయి.
అప్పుడు శ్రీ రాముడు ఉడుతని చూసి వానరులకు సున్నితంగా ఉడుత చేసిన సాయం గురించి వివరించాడు. వంతెన నిర్మాణంలో ఉడుత వేసిన చిన్న గులకరాళ్ళు, ఇసుక వంతెనను బలోపేతం చేస్తున్నాయని , వంతెన మధ్యలో ఉన్న రంధ్రాలను పూడ్చుతున్నాయని వివరించాడు. ఎవరు ఏ సహాయం చేసినా..అది ఎంత చిన్నదైనా.. అంకితభావంతో చేసినప్పుడు చాలా విలువైనదని ఆయన సైన్యానికి చెప్పాడు. రాముడు కూడా ఉడుతకు రామ సేతు నిర్మాణ విషయంలో క్రెడిట్ ఇచ్చాడు, ఆ తర్వాత వానరాలు తమ తప్పుకు క్షమాపణలు చెప్పాయి. అప్పుడు రాముడు తన చేతిపై ఉన్న ఉడుతను ఎత్తి ప్రేమగా మూడు వేళ్లతో ఉడుత వీపును తట్టాడని, అప్పటి నుంచి ఉడుత వీపుపై మూడు రేఖలు ఉద్భవించాయని నమ్ముతారు. ఈ మూడు రేఖలు రాముడి ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా నిలిచాయని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








